న్యూఢిల్లీ: ట్రాన్స్ జెండర్లకు రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీలో నివసిస్తున్న అర్హత కలిగిన ట్రాన్స్‌జెండర్లు ప్రస్తుతం మహిళలు పొందుతున్న విధంగానే ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. మరింత సమ్మిళితమైన, కరుణామయమైన ఢిల్లీని సృష్టించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు గౌరవం, సమానత్వంతో ప్రభుత్వ సేవలను పొందాలని అన్నారు. సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో లింగమార్పిడి నివాసితులు ఆర్థిక పరిమితులు లేకుండా నగరం అంతటా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఈ పథకం త్వరలో అమలు కానుందని చెప్పారు. మహిళలకు ప్రస్తుతం ఉన్న ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ మాదిరిగానే ఈ పథకం కూడా ఉంటుందని తెలిపారు. ఈ చొరవ ఢిల్లీ పౌరులందరికీ సమ్మిళిత ప్రజా సేవలను అందించడానికి, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచిస్తుందని పేర్కొన్నారు.
