- 10 నుంచి 50 శాతం దాకా లెక్చరర్లు, సిబ్బంది శాలరీల్లో కోతలు
- పలు కాలేజీల్లో 3 నుంచి 5 నెలల శాలరీలు పెండింగ్
- సమస్యలు పరిష్కరించాలని సర్కార్‌కు బాధితుల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. స్టూడెంట్ల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ.. చదువు చెప్పే లెక్చరర్లకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదు. ఫీజు రియంబర్స్‌మెంట్ రావడం లేదనే సాకుతో చాలా కాలేజీలు జీతాలు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేస్తున్నాయి. కొన్ని కాలేజీలు సగం జీతాలే ఇస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో బీటెక్ ఫస్టియర్‌లో లక్ష మందికి పైగా విద్యార్థులు చేరుతున్నారు. ప్రతి కాలేజీలో 70 శాతం కన్వీనర్ కోటాలో సీట్లను భర్తీ చేస్తుండగా, 30 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో కాలేజీలు సీట్లను అమ్ముకుంటున్నాయి. అయితే, కొంతకాలంగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సమయానికి ఇవ్వడం లేదు. దీనిని సాకుగా చూపిస్తూ పలు ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌మెంట్లు టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాల్లో కోత పెడ్తున్నాయి. గతంలో కరోనా టైమ్‌లో కూడా ఇలాగే జీతాల్లో కోత పెట్టి.. ఎగ్గొట్టాయని లెక్చరర్లు వాపోతున్నాయి.
షేక్ పేటలోని ఓ మహిళా కాలేజీలో జీతాల్లో శ్లాబుల ఆధారంగా 25 శాతం నుంచి 50 శాతం దాకా కట్ చేస్తున్నాయి. బాచుపల్లిలోని మరో కాలేజీలో 10 శాతం నుంచి 25 శాతం మేర కోత పెడ్తున్నాయి. గండిపేటలోని ఇంకో కాలేజీలో50 శాతం, మంగల్‌పల్లిలోని కాలేజీలో 50 శాతం, ఘట్కేసర్‌లోని ఓ రాజకీయ నాయకుడికి చెందిన కాలేజీలో 50 శాతం, కీసరలోని మరో కాలేజీలో 50 శాతం చొప్పున జీతాలు కట్ చేస్తున్నాయి.
ఘట్కేసర్, బండ్లగూడలోని పలు కాలేజీల్లో సుమారు 5 నెలలుగా జీతాలు, కీసరలోని ఓ కాలేజీలో 4 నెలలుగా ఇవ్వడం లేదని సిబ్బంది వాపోతున్నారు. కొన్ని కాలేజీలు ఫ్యాకల్టీకి పూర్తిగా జీతం ఇస్తున్నట్లు రికార్డుల్లో చూపించుకోవడానికి బ్యాంక్ అకౌంట్లలో శాలరీలు జమ చేసి, మళ్లీ వారి నుంచి 20 శాతం నుంచి 40 శాతం వరకు నగదును వెనక్కి తీసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
సర్కారును బద్నాం చేస్తూ..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు కాలేజీల మేనేజ్‌మెంట్లు బద్నాం చేస్తున్నాయి. సర్కార్ నుంచి రీయింబర్స్‌మెంట్ నిధులు రావడం లేదని, అందుకే జీతాలు ఇవ్వలేకపోతున్నామని సిబ్బందికి చెప్తున్నాయి. ఈ విషయంపై కొన్ని కాలేజీలు సర్క్యూలర్లు కూడా ఇస్తుండటం గమనార్హం. మరోవైపు విద్యార్థుల నుంచి చాలా కాలేజీలు పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. సర్టిఫికెట్ల ఇచ్చే సమయంలో రీయింబర్స్‌మెంట్ డబ్బులు కట్టాలని వేధిస్తున్నాయి.
డబ్బులు కట్టనిదే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నాయి. మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీకి సంబంధించి ఏ ఒక్క కాలేజీ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ.. జీతాల్లో కోతలు పెట్టడంపై లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు సరిగా రాక.. ఇంటి అద్దెలు, ఈఎంఐలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి చర్యలు చేపట్టాలని కాలేజీల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
కాలేజీల్లో విచారణ చేయాలి..
రాష్ట్రంలో చాలా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సిబ్బందికి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదనే కారణం చూపిస్తూ సిబ్బందిని వేధిస్తున్నారు. కొన్ని కాలేజీలు తర్వాత ఇస్తామని చెప్తున్నా వాటిపై మాకు నమ్మకం కలగడం లేదు. కోవిడ్ టైమ్‌లో కూడా కట్ చేసిన జీతాలు కొన్ని కాలేజీలు ఇప్పటికీ ఇవ్వలేదు. మరికొన్ని కాలేజీలకు రీయింబర్స్‌మెంట్ ఇచ్చినా కూడా జీతాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.
- అయినేని సంతోష్ కుమార్, టీఎస్ టీసీఈఏ స్టేట్ ప్రెసిడెంట్
