ఐదేళ్లు ఎంపీగా ఉండి ఏం చేశారు ?

ఐదేళ్లు ఎంపీగా ఉండి ఏం చేశారు ?

ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత ఆ హోదాలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆనాడు కేవలం పసుపు బోర్డు పేరిట రాజకీయం చేయడం తప్ప ఏమీ చేయలేని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల సమ్మేళనంలో పాల్గొన్న  ఎంపీ అరవింద్ ప్రస్తుతం కేంద్రం పసుపు రైతులను ఆదుకొనే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పిన ఘనత ఇందూరు ఓటర్లదని. ఎంపీగా ఓడిపోయినా కవితకి బుద్ధి రాలేదని చురకలంటించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పోలీసుల సాయంతో గ్రామాల్లో తిరిగే స్థితికి దిగజారారని అన్నారు. గత 8 ఏళ్లలో ప్రధాని మోడీ సామాన్యులకు లబ్ది చేకూర్చేలా పాలన కొనసాగించారని అర్వింద్ ప్రశంసించారు. మోడీ పాలనను ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని, కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో దేశ ప్రజలకు ఉచితంగా భోజనం అందించిన ఘనత మోడీ సర్కారుదని తెలిపారు.

మహిళ సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్ సర్కారు స్పైస్ పార్క్ ఏర్పాటు పేరుతో భూ సేకరణ చేసి, కాంపౌండ్ కట్టి వదిలేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని, అఘాయిత్యాల బారిన పడిన మైనర్లు అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఓ వర్గం ఓటు బ్యాంకు కోసం సీఎం కేసీఆర్ లా అండ్ ఆర్డర్ గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ వెళుతుందనే ప్రచారం జరుగుతోందని..అలా వెళ్లినా..గెలిచేది బీజేపీ పార్టీయేనని ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.