చండూరు, వెలుగు: చండూరు మున్సిపాలిటీని రాబోయే 25 ఏండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఆదేశించారు. గురువారం చండూరు మున్సిపాలిటీతో పాటు చండూరు మండలం పుల్లెంల గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో 10 కొత్త గ్రౌండ్ లెవల్ ట్యాంకులు నిర్మించడంతో పాటు నిరుపయోగంగా ఉన్న 10 ట్యాంకులను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
పీహెచ్సీ పాత బిల్డింగ్‌ను తొలగించి కొత్త భవనం నిర్మించాలని సూచించారు. యునానీ వైద్యంపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. ప్రతి వార్డులో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇడికూడ, -తెరటుపల్లి రహదారి విస్తరణ పనులను పరిశీలించి ప్రభావితమయ్యే ఇండ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ కోడి శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ భూతరాజు దశరథ పాల్గొన్నారు.
