తెలంగాణ శబరిమలైగా విరాజిల్లుతున్న అయ్యప్ప స్వామి టెంపుల్

తెలంగాణ శబరిమలైగా విరాజిల్లుతున్న అయ్యప్ప స్వామి టెంపుల్

తెలంగాణలో ‘శబరిమలై’ ఎక్కడున్నది అనుకుంటున్నరు కదా! నర్సంపేటలోని శ్రీధర్మశాస్తా అయ్యప్ప స్వామి టెంపుల్ ‘తెలంగాణ శబరిమలై’గా విరాజిల్లుతోంది. ఇరవై ఏళ్లుగా కేరళలోని శబరిమలైలో జరిగే ప్రతి పూజా.. ఇక్కడ కొలువై ఉన్న అయ్యప్పకూ చేస్తున్నరు. ప్రతి సంవత్సరం దాదాపు మూడువేల మంది భక్తులు ఈ గుడికి వచ్చి అయ్యప్ప మాల వేసుకుంటారు. ఈ రెండు నెలలూ ఈ గుడి చుట్టూ భక్తుల కోలాహలం జాతరను తలపిస్తుంది.

నర్సంపేటలోని వరంగల్‌‌​ రోడ్​లో ఈ అయ్యప్ప ఆలయం ఉంది.  ఇక్కడికొచ్చి అయ్యప్ప స్వామి మాల తీసుకునే స్వాముల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. తెలంగాణలోనే అతిపెద్ద అయ్యప్ప దేవాలయంగా పేరు రావడంతో.. చాలామంది భక్తులు ఇక్కడికి ‘క్యూ’ కడుతున్నారు.

శబరిమలైలో జరిగినట్టే..

కేరళలోని శబరిమలైలో జరిగే ఉత్సవ బలి, క్షేత్ర బలి, పల్లివేట, పంబారట్టు, నాలుగు పడి పూజ కార్యక్రమాలు ఈ గుడిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పల్లివేట, పంబారట్టు ఉత్సవాలకు అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా పుంగావనం, జలక్రీడ కోసం మాదన్నపేట చెరువు దగ్గరికి తీసుకెళ్తారు.  ఈ రెండు ఉత్సవాలను చూడటానికి వేలమంది భక్తులు తరలివస్తారు. మండలకాల పూజలు మొదలయ్యేనాటి నుంచి 41 రోజులు  నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం గత ఇరవై ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. శింగిరికొండ రామాంజనేయులు, ఇంకొంతమంది దాతలు కలిసి ఈ గుడిని కట్టించారు.

హనుమాన్ మాల కూడా..

ఈ అయ్యప్ప దేవాలయంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. మండల కాల పూజలకు మాలధారణ చేసిన స్వాములతో పాటు వాళ్ల ఫ్యామిలీ అంతా గుడికి వచ్చి మణికంఠస్వామిని దర్శించుకుంటారు. అంతకుముందు ఏడాది కోరుకున్న కోరికలు నెరవేరిన భక్తులు స్వామి వారికి ఇలవేల్పుగా మారి, మండల కాల పూజలు జరిగే అన్ని రోజులూ ఇక్కడే ఉండి స్వామికి సేవ చేస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఎనిమిదేళ్ల కింద భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠంచారు. ప్రతి ఏడాది మార్చిలో వందలమంది భక్తులు ఇక్కడికి వచ్చి హనుమాన్​ మాలలు వేసుకుంటారు. విజయవాడ హనుమాన్​ పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్​ స్వామి ప్రతి సంవత్సరం,  మార్చిలో ఒకరోజు వచ్చి మాలధారణ చేసిన స్వాములకు హనుమాన్​ మాలను ఇస్తారు.

భక్తుల సహకారంతోనే

భక్తుల సహకారం, నమ్మకంతోనే నర్సంపేట అయ్యప్ప దేవాలయానికి రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు వస్తున్నాయి.  మండలకాల పూజలే కాకుండా నిత్యం ధూప, దీప పూజలతో పాటు నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తున్నాం.  పుట్టిన రోజు, యానివర్సరీలు లాంటి శుభకార్యాలను భక్తులు ఇక్కడ జరుపుకొని, అన్నదానం చేస్తున్నారు. హైవే ఎదురుగా స్వామివారి పేరు మీద షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మించాం. దాని నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాలయ అభివృద్దికి కేటాయిస్తాం.                                               –   శింగిరికొండ మాధవశంకర్​, ఆలయ చైర్మన్​