షిండే తొవ్వలో అజిత్ పవార్..బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ కీలక నేత

షిండే తొవ్వలో  అజిత్ పవార్..బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ కీలక నేత
  • 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు 
  • మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్, 
  • మిగతా వాళ్లు మంత్రులుగా ప్రమాణం  
  • ఎమ్మెల్యేలంతా తనకే సపోర్ట్ చేస్తున్నారని ప్రకటన  
  • వాళ్లపై చర్యలు తీసుకుంటామన్న శరద్ పవార్

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం సంచలనం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అజిత్ పవార్ పార్టీలో తిరుగుబాటు చేశారు. పార్టీలో తనకు సరైన స్థానం దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న అజిత్.. పార్టీనే తనవైపు తిప్పుకునేలా చక్రం తిప్పారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో చేతులు కలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆపై రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆయన వెన్నంటి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలికా లేదని, పార్టీ ఎమ్మెల్యేలంతా తనవెంటే ఉన్నారని అజిత్ చెప్పారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మీటింగ్​కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలె, సీనియర్ నేత ఛగన్ భుజ్ బల్ కూడా హాజరయ్యారు. సుప్రియ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ రాజ్ భవన్​కు వెళ్లడం.. గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. అజిత్ పవార్​తో పాటు ప్రమాణం చేసిన వారిలో ఛగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే పాటిల్, అదితి తత్కారే, ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, ధర్మరాజ్ బాబారావ్ ఆత్రం, సంజయ్ బన్సోడే, అనిత్ భాయిదాస్ పాటిల్ ఉన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు 40 మంది తమకు సపోర్ట్ చేస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ బవంకులే చెప్పారు.   

పార్టీలో మంచి పదవి దక్కనందుకే?  

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అజిత్ పవార్ రెండ్రోజుల కిందటే ప్రకటించారు. ఇటీవల పలు సందర్భాల్లో ఆయన అసంతృప్తితో కామెంట్లు చేశారు. పోయిన నెలలో పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ రాజీనామా చేశారు. కానీ కార్యకర్తలు తననే ఉండాలని కోరుకుంటున్నారంటూ మూడురోజుల్లో తిరిగి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పవార్ బిడ్డ సుప్రియా సూలె, కీలక నేత ప్రఫుల్ పటేల్​ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అజిత్ పవార్​కు పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి బయటికి రాకుండానే పార్టీని తనవైపు తిప్పుకునేలా అజిత్ పవార్ పావులు కదిపినట్లు తెలుస్తోంది. బీజేపీ సర్కారులో చేరాలన్న విషయంపై చాలా రోజుల నుంచే తమ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు కూడా ఆయన వెల్లడించారు. 

మేం సపోర్ట్ చెయ్యం: జయంత్ పాటిల్  

మొత్తం పార్టీ ఎమ్మెల్యేలంతా తనకు సపోర్ట్ చేస్తున్నారంటూ అజిత్ పవార్ చేసిన ప్రకటనను ఎన్సీపీ మహారాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ జయంత్ పాటిల్ ఖండించారు. ‘‘బీజేపీతో చేతులు కలపాలని ఏడెనిమిది మంది వ్యక్తులు చెప్తున్నారు. కానీ వారికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. పార్టీ ఆదేశాలను కాదని మంత్రులు అయినవాళ్లతో మాకు సంబంధం లేదు” అని ఆయన అన్నారు. అజిత్ వర్గానికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేదని ఎన్ సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తాపసే కూడా స్పష్టం చేశారు. 

బీజేపీ ‘వాషింగ్ మెషీన్’ పని షురువైంది: జైరాం 

ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ తదితరులు తమతో చేరడంతో ఇప్పుడు బీజేపీ ‘వాషింగ్ మెషీన్’ పనులు షురూ అయ్యాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. వీరిలో ఎక్కువ మంది ఈడీ, సీబీఐ, ఐటీ అధికారుల ముందు తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వాళ్లు ఇప్పుడు క్లీన్ చిట్ పొందారని కామెంట్ చేశారు. 

అవినీతిని మోదీ పెంచి పోషిస్తున్నరు: ఆప్  

ప్రధాని మోదీ అవినీతిని పెంచి పోషిస్తున్నరని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ‘‘అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చిన రెండ్రోజులకే అజిత్ పవార్​ను డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు. అవినీతిపరులను పెంచి పోషించే వాళ్లలో ఆయనకు మించిన వారు లేరు” అంటూ ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్షనేతగా జితేంద్ర అవద్​

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్​ను ఎన్సీపీ నియమించింది. అసెంబ్లీలో అపొజిషన్​ లీడర్​గా ఉన్న అజిత్​పవార్​ఆదివారం షిండే ప్రభుత్వంలో చేరడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్​ పాటిల్​ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 
జితేంద్ర అవద్​ను అసెంబ్లీలో విపక్ష నేతగా, పార్టీ విప్​గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీ విప్​కు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. 

నాలుగేళ్లలో మూడుసార్లు డిప్యూటీగా ప్రమాణం

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అజిత్​ పవార్ కు ఇది మూడోసారి. నాలుగేళ్ల వ్యవధిలోనే ఇలా మూడుసార్లు ప్రమాణస్వీకారం చేయడం విశేషం. 2019లో బీజేపీ ప్రభుత్వంతో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అది కేవలం మూడు రోజుల ముచ్చటగానే ముగిసింది. బీజేపీ, శివసేన మధ్య పొత్తు విచ్ఛిన్నం కావడంతో అజిత్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడగా.. ఎన్సీపీ తరఫున రెండోసారి డిప్యూటీగా ప్రమాణం చేశారు. ఈసారి 2019 నవంబర్ నుంచి 2022 జూన్ వరకు అజిత్ పదవిలో కొనసాగారు. శివసేన పార్టీలో చీలిక రావడంతో ప్రభుత్వం పడిపోగా అజిత్ రాజీనామా చేశారు. తాజాగా బీజేపీకి మద్దతు పలికి ఆదివారం మూడోసారి డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వంలో సీఎంలు అశోక్ చవాన్, పృథ్విరాజ్ చవాన్​ల హయాంలోనూ అజిత్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కోఆపరేటివ్ బోర్డ్ మెంబర్ గా..

1982లో షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ బోర్డ్ మెంబర్ గా అజిత్ పవార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1991లో పుణె డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అదే ఏడాది బారామతి నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే, పవార్ కోసం రాజీనామా చేశారు. తర్వాత బారామతి అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ అజిత్ సేవలందించారు. నీటి వనరుల శాఖ మంత్రిగా ఉన్నపుడు అజిత్ అక్రమాలకు పాల్పడ్డారని, రూ.70 వేల కోట్ల స్కాం చేశారని 2014లో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు.

ఎన్సీపీలో చీలికలేదు

శివసేన‑బీజేపీ సర్కారులో భాగం కావాలన్న నిర్ణయానికి పార్టీ ఎమ్మెల్యేలంతా మద్దతు ఇస్తున్నారని అజిత్ పవార్ చెప్పారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీలో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఎన్సీపీ పేరు, సింబల్ తోనే పోటీ చేస్తామన్నారు. ‘‘శివసేనతో కలిసి వెళ్లగలిగినప్పుడు బీజేపీతో కూడా కలిసి వెళ్లొచ్చు. నాగాలాండ్​లో ఇదే జరిగింది. అక్కడ ఏడుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేశారు. అక్కడ బీజేపీతో కలిస్తే తప్పు కానిది.. ఇక్కడ కలిస్తే తప్పెలా అవుతుంది?” అని ప్రశ్నించారు. 

రెబెల్స్ పై చర్యలు తీసుకుంటాం: శరద్ పవార్

శివసేన–బీజేపీ సర్కారులో చేరాలని పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వంలో చేరిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలో ఇలాం టి తిరుగుబాట్లు తనకు కొత్తేమీ కాదన్నారు. ‘‘కొంత మంది వెళ్లారని నేనేం బాధపడను. కానీ వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే బాధ కలు గుతోంది” అని పవార్ అన్నారు. కాగా, అజిత్ ఇంట్లో భేటీ జరుగుతుండగా.. దాని గురించి అదేసమయంలో పుణేలో ఉన్న శరద్ పవార్ ను విలేకరులు ప్రశ్నించారు. ఆ మీటింగ్ గురించి తనకు తెలియదని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ కు పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించే అధికారం ఉందని శరద్ పవార్ బదులిచ్చారు.