ఎలా తింటారో చూస్తాం : టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వెల్లుల్లి కిలో రూ.230

ఎలా తింటారో చూస్తాం : టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వెల్లుల్లి కిలో రూ.230

వంటగదిలోని ముఖ్యమైన పదార్థాలలో వెల్లుల్లి ఒకటి.  ఆకస్మిక ధర వంటగది బడ్జెట్ మరియు ఆహార పదార్థాల రుచిని ప్రభావితం చేస్తుంది.  ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వెల్లుల్లి  ధర తారస్థాయికి చేరుకుంది. నవీ ముంబయి మార్కెట్లో  రూ.230 వరకు పలకడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క రోజులో కిలో రూ.60 పెరగడం ఇటీవల ఎన్నడూ లేదని వ్యాపారులు సైతం చెబుతున్నారు.  దేశవ్యాప్తంగా టమోటా, పలురకాల కూరగాయల ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో రాష్ట్రానికి దిగుమతికూడా గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా టమోటా ధరలు ఆకాశాన్నంటే విధంగా విపరీతంగా పెరిగాయి. దీంతో హోటళ్లలో కూడా టమోటా రైస్‌, చట్నీ లు మాయమయ్యాయి. ఈ నేపథ్యంలో వెల్లుల్లి ధర కూడా విపరీతంగా పెరిగింది.

నవీ ముంబయి రిటైల్  మార్కెట్‌లో రకాన్ని బట్టి కిలో రూ.200 నుంచి రూ.230కి విక్రయిస్తుండగా, చిల్లర దుకాణాల్లో మరో రూ.20 వరకు పెంచి విక్రయిస్తున్నారు. వాషిలోని హోల్‌సేల్ మార్కెట్‌కు రాజస్థాన్, గుజరాత్ ,మధ్యప్రదేశ్ నుండి వెల్లుల్లి వస్తుంది . ఈ ఏడాది ఈ రాష్ట్రాల్లో వెల్లుల్లి పంట దిగుబడి తగ్గింది.  ఉత్పత్తి తగ్గడంతో వెల్లుల్లి ప్రభావం దాని ధరపై చూపిస్తోంది.  దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధర విపరీతంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.  సాధారణంగా   వాషిలోని హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు  దాదాపు 20 ట్రక్కుల వెల్లుల్లి వస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా వీటి సంఖ్య 10లోపు తగ్గగా, గురువారం (జులై 13)న  కేవలం 7 ట్రక్కుల్లో మాత్రమే వెల్లుల్లి వచ్చింది. దీంతో అమాంతంగా వెల్లుల్లి ధరలకు రెక్కలొచ్చాయి. జులై నెల  మొదట్లో కిలో 150 రూపాయిలున్న వెల్లుల్లి .... ఇప్పడు ( జులై14) 230 రూపాయిలకు చేరగా... ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.