వింబుల్డన్ ఫైనల్ విజేత జొకోవిచ్

వింబుల్డన్ ఫైనల్ విజేత జొకోవిచ్
  • ఐదోసారి వింబుల్డన్ నెగ్గిన నోవాక్
  • ఫైనల్లో ఫెడరర్ విజయం

లండన్:  లెజెండరీ ప్లేయర్ల పోరులో ప్రపంచ నం.1 నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరోసారి తన ఆధిక్యాన్ని కనబర్చాడు. హోరాహోరీగా సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ కీలకదశలో సత్తాచాటి రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)కు చెక్పెట్టి టైటిల్ నెగ్గాడు.  ఐదుగంటలకుపైగా సాగిన మారథాన్ మ్యాచ్ లో జొకోవిచ్ 7–6 (7/5), 1–6, 7–6(7/4), 4–6, 13–12 (7/3)తో  ఫెడరర్ పై అద్భుత విజయం సాధించాడు. దీంతో ఫెడెక్స్ పై ముఖాముఖిపోరులో తన ఆధిక్యాన్ని 26–22కు పెంచుకున్నాడు. అంతకుముందు సుదీర్ఘంగా సాగిన ఈ ఫైనల్ పోరు సుదీర్ఘ ర్యాలీలతో, కచ్చితమైన బేస్ లైన్ షాట్లతో జోరుగా సాగింది. ఇరువురు ప్లేయర్లు హేమాహేమీలు కావడంతో ప్రతీ పాయింట్ కు కొదమసింహాల్లా పోరాడారు. అయితే కీలకదశలో ఒత్తిడిని అధిగమించిన సెర్బియన్ స్టార్ గ్రాస్ కోర్టుపై మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయి విజేతగా నిలిచాడు.

తొలిసెట్ నుంచి అటు జొకోవిచ్, ఇటూ ఫెడరర్ ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా పోరాట పటిమ కనబర్చారు. తొలిసెట్ నాలుగో గేమ్ లో లభించిన బ్రేక్ పాయింట్ అవకాశాన్ని ఫెడరర్ వృథా చేసుకున్నాడు. అనంతరం ఇరువురు సర్వీస్ నిలబెట్టుకోవడంతో ఆ సెట్ టైబ్రేకర్ కు దారి తీసింది. ఇందులో తొలుత 3–1తో ఆధిక్యంలో నిలిచిన జోకో.. అనూహ్యంగా  3–5తో వెనుకంజలో నిలిచాడు. అయితే కీలకదశలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సరిగ్గా గంటలో తొలిసెట్ ను జొకోవిచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రెండోసెట్లో తేరుకున్న ఫెడెక్స్ విజృంభించాడు. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్ చేసి 26 నిమిషాల్లోనే సెట్ ను కైవసం చేసుకుని జోకోకు షాకిచ్చాడు. అయితే మూడోసెట్లో ఇరువురు ప్లేయర్లు హోరాహోరీగా తలపడడంతో మరోసారి సెట్ టైబ్రేకర్ కు దారితీసింది. అంతకుముందు పదోగేమ్ లో తనకు లభించిన సెట్ పాయింట్ను ఫెడెక్స్ వృథా చేశాడు. ఈ టైబ్రేకర్ లో జొకో మరోసారి తన ఆధిపత్యాన్ని కనబర్చాడు. ఆరంభంలో 3–0 ఆధిక్యంలోకి వెళ్లిన సెర్బియన్ స్టార్.. 7–4తో సెట్ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగోసెట్లో ఫెడరర్ తన అనుభవన్నంతా రంగరించి ఆడాడు. ఐదు, ఏడు గేమ్ల్లో ప్రత్యర్థి గేమ్లను బ్రేక్చేసి 5–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వచ్చాడు. తర్వాతి గేమ్లో తన సర్వీస్ను కోల్పోయిన ఫెడెక్స్.. మలి సర్వీస్ను నిలుపుకుని మ్యాచ్ను 2-–2 సెట్లతో సమం చేశాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదోసెట్కు దారితీసింది.

మ్యాచ్ పాయింట్ను కాచుకుని..

సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్లో జోకోవిచ్ కు అదృష్టం కలిసొచ్చింది. 16వ గేమ్ లో రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకుని మరీ విజయం దక్కించుకున్నాడు. అంతకుముందు  సెట్లో రెండుసార్లు జోకో సర్వీస్ ను బ్రేక్ చేసిన ఫెడరర్ 8–7తో సర్వీస్ ప్రారంభించాడు. అయితే ఓదశలో 40–15తో మ్యాచ్ గెలిచేలా కన్పించిన ఫెడెక్స్ అనూహ్యంగా సర్వీస్ ను చేజార్చుకున్నాడు. ఇలా ఈ సెట్లో ఇరువురు 12 గేమ్ల చొప్పున నెగ్గడంతో మ్యాచ్ టైబ్రేకర్కు దారి తీసింది. అయితే టైబ్రేకర్లో ఫెడరర్కు ఎలాంటి అవకాశమివ్వని జొకోవిచ్ సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.