అక్క పారిపోవడంతో.. చెల్లి పెళ్లికూతురైంది

అక్క పారిపోవడంతో.. చెల్లి పెళ్లికూతురైంది

ఒడిషా: మరికొద్ది గంటల్లో వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా పెళ్లి కూతురు మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో గ్రామంలో తమ పరువు పోతుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ముందుగా అనుకున్న వరుడితో మైనర్ బాలికైన తమ రెండవ కూతురిని ఇచ్చి పెళ్లి జరిపించి వివాహతంతు పూర్తి చేశారు. అయితే 15 ఏండ్ల మైనర్ బాలికకు పెళ్లి జరపడంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఒడిషాలోని కలహండి లో జరిగిందీ సంఘటన.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే పెళ్లి జరగడంతో ఆ బాలికను వరుడి నుంచి రక్షించి, ఆమె బాధ్యతను ఆమెన కుటుంబ సభ్యులకు అప్పగించారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆ బాలిక కాపురానికి వెళుతుందని, అప్పటివరకు తన చదువును పూర్తి చేయాలనుకుంటే ఆమె ఇంట్లో లేదా హాస్టల్‌లో ఉండవచ్చని పోలీసులు నిర్ణయించారు.

పెళ్లి కూతురు సోదరుడు అర్జున్ ఈ విషయం గురించి మాట్లాడుతూ .. పెళ్లి స‌మ‌యంలో తన అక్క మ‌రో వ్య‌క్తితో పారిపోయిందని తెల‌సుకొని, అప్ప‌టిక‌ప్పుడు త‌న‌ చెల్లెలిని వరుడితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఆ క్ష‌ణంలో తాము త‌మ కుటుంబ ప‌రువు పోతుంద‌ని భావించి ఈ పని చేశామ‌ని తెలిపాడు.