కేజీబీవీలో కాంట్రాక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు

కేజీబీవీలో కాంట్రాక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని కస్తూర్బా(కేజీబీవీ) గురుకుల విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్స్(యూఆర్ఎస్​)లలో  కాంట్రాక్ట్​ ఉద్యోగాల కోసం జరిపిన ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయా రెసిడెన్సియల్స్​లో స్వీపర్, కుక్స్, వాచ్​మెన్లతోపాటు ఇతర కాంట్రాక్టు పోస్టులకు మే 10వ తేదీన ఇంటర్వ్యూలు చేశారు. అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీని వేసి అందులో డీఈఓ, ఎంఈఓ స్థాయి అధికారులతోపాటు జీసీడీఓ పీడీలను చేర్చారు. జిల్లాలోని 10 కేజీబీవీ, 1 యూఆర్ఎస్​ కోసం అవసరమైన పోస్టులు ఫిలప్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల కోసం ఏప్రిల్ 11న నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు 260పైగా అప్లికేషన్లు రాగా 1:3 ప్రకారం ఇంటర్వ్యూలకు పిలిచారు. సెలెక్ట్​ అయిన వారి నుంచి పదో తరగతితో పాటు అవసరమైన సర్టిఫికెట్లు తీసుకున్నారు. నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎవరి ఒత్తిడి కారణంగానో అధికారులు ఇంతకు ముందు చేసిన ఇంటర్వ్యూలను రద్దు చేసి మరోసారి ఇంటర్వ్యూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో గతనెల సెలెక్టయిన వారికి ఫోన్లు చేసి ఎవరి సర్టిఫికెట్లు వారు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో సెలెక్టయిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలు లోకల్ ప్రాతిపదికన నిర్వహించారు. కేజీబీవీ ఏ మండలంలో ఉంటే ఆ మండలాలకు చెందిన అభ్యర్థులనే ఇంటర్వ్యూకు పిలిచి సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు సడన్​గా మండలాన్ని లోకల్ గా తీసుకోకుండా జిల్లానే లోకల్ గా తీసుకుని రిక్రూట్​మెంట్ చేయాలని అధికారులు నిర్ణయించిట్లు తెలిసింది. 

కాంట్రాక్టు పోస్టులను కూడా ఇడుస్తలేరు..

జిల్లాలో భర్తీ అవుతున్న రెగ్యులర్ పోస్టులతోపాటు కాంట్రాక్టు పోస్టుల నియామకంలో కూడా భారీగా అవినీతి చోటుచేసుకుంది. గతంలో వైద్యశాఖ ల్యాబ్ టెక్నీషియన్ల నియామకంలో అవకతవకలు జరగడంతో ఆయా లిస్టులను నిలిపివేశారు. అర్హత లేని వారిని సిఫారసులతో నియమించుకోవడంతో దుమారం లేచింది. ఇప్పుడు విద్యాశాఖలో కూడా అలాంటి పరిస్థితే నెలకొన్నట్లు తెలుస్తోంది. జెన్యూన్​గా ఇంటర్వ్యూలు జరిగాయి అనుకునేలోపే నియామకాల ప్రాతిపదిక కరెక్ట్​గా లేదు, మరోసారి ఇంటర్వ్యూలు చేసి పోస్టులు భర్తీ చేయాలని కమిటీ తీర్మానించినట్లు సమాచారం. అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సెలెక్షన్​లే తప్పుగా భావించి మరోసారి ఇంటర్వ్యూలు చేయాలనడంతో, అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. 

ఎలాంటి నోటిఫికేషన్​ లేకుండానే..

జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఈ సెలెక్షన్​ను వ్యతిరేకించి, మరోసారి నియామకాలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఆయా మండలాలను లోకల్​గా తీసుకొని అప్లయ్ చేసుకున్నారు. ఇప్పుడు జిల్లాను లోకల్​గా తీసుకున్నట్లయితే గతంలో అప్లయ్​ చేసుకున్నవారు తీవ్రంగా నష్టపోతారు. ఎలాంటి నోటిఫికేషన్​ లేకుండా నోటిమాటతోనే మరోసారి నియామకాలు చేపట్టాలనుకోవడం వెనుక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.

పొలిటీషియన్ల ప్రెజర్​తోనే..

ఏ శాఖలోనైనా కాంట్రాక్టు పోస్టుల నియామకంపై స్థానిక పొలిటీషియన్ల ప్రెజర్ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేటు ఇండస్ట్రీ ఏర్పాటు చేసినా అక్కడ స్థానిక పొలిటీషియన్లు వాలిపోతున్నారు. ఎలాంటి అర్హత లేకపోయినా, స్థానిక లీడర్​ పంపిన వ్యక్తిని సంస్థ పనిలో పెట్టుకోవాల్సిందే. ఆ వ్యక్తి ఏ డిపార్ట్​మెంటుకు పనికిరాకపోయినా పెట్టుకొని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కమాన్​పూర్ మండలంలోని ఓ సోలార్ ఇండస్ట్రీ యాజమాన్యం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వ శాఖలైన వైద్యం, విద్యశాఖలో కూడా ఈ పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోయింది. విద్యాసంస్థల్లో నాన్​ టీచింగ్ స్టాఫ్ 90 శాతం కాంట్రాక్టు పద్ధతిలోనే రిక్రూట్ చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అలాగే సెంటనరీ కాలనీలోని జేఎన్ టీయూ కాంట్రాక్టు నియామకాలు ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ లీడర్ ఫైనల్ డెసిషన్​ మీదే ఆధారపడి ఉంటున్నాయని సమాచారం. దీంతో అర్హులైన నిరుద్యోగులకు కనీసం కాంట్రాక్టు పోస్టులు కూడా దక్కడం లేదు.

ఫోన్ చేసి సర్టిఫికెట్లు తీసుకపొమ్మన్నరు

పోయిన నెల ఇంటర్వ్యూలు చేసిండ్రు. అసిస్టెంట్ కుక్​ కోసం నేను ఇంటర్వ్యూకు వెళ్లాను. ఇంటర్వూ అయిపోయినంక మా సర్టిఫికెట్లు తీసుకున్నరు. ఎప్పుడు రావాలో ఫోన్​ చేసి చెప్తమన్నరు. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫోన్ చేసి మీ సర్టిఫికెట్లు తీసుకపొమ్మని చెప్తున్నరు. 
- సరిత, పెద్దపల్లి

సెలెక్ట్​ అయినోళ్లకే పోస్టులియ్యాలె

సెలెక్ట్ అయినోళ్లను విధుల్లోకి తీసుకోవాలె. నేను నైట్ వాచ్​మన్ ఇంటర్వ్యూ కు వెళ్లా. ఇంటర్వ్యూ చేసి మా సర్టిఫికెట్​ తీసుకున్నరు. ఇప్పుడు మళ్లా ఇంటర్వ్యూ అంటే మేం నష్టపోతం. అప్పుడు లోకల్ అంటే అలాగే అప్లయ్​ చేసుకున్నాం. ఇప్పుడు జిల్లాస్థాయిలో అంటే చాలా మంది అనర్హులైతరు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మరోసారి ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు సెలెక్ట్​అయిన వాళ్ల పరిస్థితి ఏంటి. దీనికి మేం ఒప్పుకోం.
- ఇటికాల మహేశ్, బొంపెల్లి, పెద్దపల్లి