శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

శనివారం ఒక్కరోజే22 టీఎంసీలు చేరిక
ఆదివారం సాయంత్రానికి మరో 82 వేల క్యూసెక్కులు

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. శనివారం ఒక్కరోజే ఈ ప్రాజెక్టులోకి 22 టీఎంసీల నీళ్లు చేరగా, ఆదివారం సాయంత్రానికి 82 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చింది. 215.81 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్​లో నీటి నిల్వ 73.23 టీఎంసీలకు చేరింది. అలాగే ఆల్మట్టికి కూడా భారీ వరద కొనసాగుతున్నది. 1.36 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా 62 వేల క్యూసెక్కులు కిందికి వదిలేస్తున్నారు. నారాయణపూర్​కు 57 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 42 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. జూరాలకు 66 వేల క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తుండగా 44 వేల క్యూసెక్కులు కిందికి వదిలేస్తున్నారు. తుంగభద్రకూ భారీ వరద కొనసాగుతోంది. 100.86 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో 72.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
 
గోదావరి ప్రాజెక్టులకు తగ్గిన ఇన్​ఫ్లో
గోదావరి ప్రాజెక్టులకు వరద తగ్గింది. నిజాంసాగర్​ ఒక గేటు ఎత్తి 4,800 క్యూసెక్కులను కిందికి వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు 4,697 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా రెండు గేట్లు ఎత్తి 3,242 క్యూసెక్కులు రిలీజ్  చేస్తున్నారు. ఎల్లంపల్లికి 44  వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ఆరు గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. మిడ్​మానేరు, ఎల్ఎండీకి వరద పెరగడంతో మళ్లీ గేట్లు ఎత్తారు. రెండు ప్రాజెక్టుల నాలుగు గేట్లు ఎత్తారు. మేడిగడ్డకు 5.71 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 85 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. తుపాకులగూడేనికి 9.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 59 గేట్లు ఎత్తి అంతే నీటిని కిందికి విడిచిపెడుతున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి క్రమేణా తగ్గుతోంది. ఇక్కడ ప్రవాహం 13.31 లక్షల క్యూసెక్కులు ఉండగా 51.30 అడుగుల ఎత్తులో ప్రవాహం ఉంది. మరోవైపు గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీని దాటి 831.35 టీఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో కలిశాయి. కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీని దాటి 46.71 టీఎంసీలు సముద్రంలోకి చేరాయి.