బీజేపీని ఓడించేందుకు కలిసి పోటీ చేస్తం..

బీజేపీని ఓడించేందుకు  కలిసి పోటీ చేస్తం..
  • 16 పార్టీలకు చెందిన 30 మంది హాజరు
  • మేమంతా ఒక్కటయ్యాం: ప్రతిపక్షాలు
  • నితీశ్ ఇంట్లో అపొజిషన్​ లీడర్ల భేటీ
  • జులైలో మరోసారి సిమ్లాలో సమావేశం
  • రోడ్​మ్యాప్ ఫైనల్​ చేస్తామని వెల్లడి

పాట్నా :  2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు ప్రతిపక్షాలు ప్రకటించాయి. అయితే.. సీట్ల షేరింగ్.. ఎన్నికల్లో ఎట్ల ముందుకు వెళ్లాలి.. అనే దానిపై ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని తెలిపాయి. సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం పాట్నాలో నితీశ్​ ఇంట్లో విపక్షాల భేటీ జరిగింది. మొత్తం 16 పార్టీలకు చెందిన 30 మంది లీడర్లు అటెండ్ అయ్యారు. 

కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ, వెస్ట్​బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్​కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్​సీఎం హేమంత్ సోరెన్, సమాజ్​వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ ప్రెసిడెంట్ శరద్ పవార్​తో పాటు పీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల లీడర్లు హాజరయ్యారు. సీఎం నితీశ్ కుమార్ ఇంట్లో జరిగిన ఈ భేటీ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. జులై మరోసారి షిమ్లాలో భేటీ అయి సీట్ల షేరింగ్, పోటీపై రోడ్ మ్యాప్ ఫైనల్ చేస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి.

భేటీ సక్సెస్ అయింది : నితీశ్​కుమార్

జాయింట్ ప్రెస్​కాన్ఫరెన్స్​లో నితీశ్ కుమార్ మాట్లాడారు. ‘‘అపోజిషన్​ పార్టీల భేటీ సక్సెస్ అయ్యింది. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లేందుకు నిర్ణయించాం. జులైలో జరిగే షిమ్లా మీటింగ్​కు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహిస్తారు. ఆ భేటీలోనే మొత్తం ఫైనల్ చేస్తాం. ఎవరు.. ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది నిర్ణయిస్తాం. జాతీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నాం. దేశ చరిత్రను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. దీన్ని కలిసికట్టుగా అడ్డుకుంటాం’’అని స్పష్టం చేశారు.

బీజేపీని గద్దెదించడమే మా లక్ష్యం : ఖర్గే

2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కామన్​ ఎజెండా తయారు చేస్తున్నట్లు కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. వచ్చే నెల షిమ్లాలో మరోసారి సమావేశం అవుతామని తెలిపారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించి క్లారిటీకి వస్తామని చెప్పారు. ఒకే వ్యూహం అన్ని రాష్ట్రాల్లో పని చేయదన్నారు. బీజేపీని తరిమికొట్టాలని మాత్రం నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇందులో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మమ్మల్ని ప్రతిపక్షాలని పిలవొద్దు : మమతా బెనర్జీ

2024 లోక్‌‌స‌‌భ ఎన్నిక‌‌ల్లో బీజేపీకి వ్యతిరేకంగా విప‌‌క్షాలన్నీ ఏక‌‌మై పోరాడుతాయ‌‌ని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ‘‘ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతాం. మేమూ భార‌‌త్ మాతా కీ జై అంటాం. మేం ఇండియన్ సిటిజన్స్. మమ్మల్ని ప్రతిపక్షాలని పిలవకండి. మ‌‌ణిపూర్ తల్లిడిల్లితే మేమూ బాధపడ్డాం”అని మమతా బెనర్జీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి భారీ ఓటమి తప్పదని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. తాను ఫిట్​గా ఉన్నానని, మోదీని ఫిట్ చేస్తానని ఎద్దేవా చేశారు. 

దేశాన్ని బీజేపీ నాశనం చేసింది : డి.రాజా

బీజేపీ తొమ్మిదేండ్లు దేశాన్ని నాశనం చేసిందని సీపీఐ లీడర్ డి.రాజా విమర్శించారు. గవర్నమెంట్ ఫెడరల్ సిస్టమ్​పై దాడి జరుగుతున్నదని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడానికి ప్రయత్నించే వారి నుంచి దేశాన్ని రక్షిస్తామని శివసేన (యూబీటీ) లీడర్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. జమ్మూ కాశ్మీర్‌‌లో జరిగిన సంఘటనలు ఇప్పుడు ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్నాయని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విమర్శించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 17 పార్టీలు.. అధికారం కోసం కాదని.. సిద్ధాంతాల కోసం కలిసి వచ్చాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు.

రాహుల్.. పెండ్లి చేసుకో : లాలూ

‘పెండ్లి చేసుకో.. ఇంకా లేట్ చేయకు.. మేమంతా బరాత్​లో పాల్గొంటాం’ అని రాహుల్​తో లాలూ ప్రసాద్ అన్నారు. దీనికి రాహుల్ బదులిస్తూ..‘‘ఇక మీరు పెండ్లి గురించి చెప్పారు కదా.. కచ్చితంగా జరుగుతుంది”అని అన్నారు. ‘పెండ్లికి ఇంకా టైం ఉందా? మీ అమ్మ మాట వినడం లేదంట. సోనియానే నాతో చెప్పారు. పెండ్లిపై ఇప్పుడే క్లారిటీ ఇచ్చేయ్. నేను చెప్పినప్పుడే పెండ్లి చేసుకుని ఉంటే.. అయిపోయేది’’అని రాహుల్​తో లాలూ అన్నారు. దీంతో ప్రెస్​మీట్​లో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.

మాది భారత్​ జోడో.. బీజేపీది భారత్ తోడో..: రాహుల్​

కాంగ్రెస్​ పార్టీ దేశ ప్రజలను కలుపుతూ.. ప్రేమను పంచుతూ.. భారత్ జోడో యాత్ర చేస్తుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అపోజిషన్ పార్టీలన్నీ కలిసి బీజేపీని కచ్చితంగా ఓడిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చత్తీస్​గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ బంపర్ మెజార్టీతో గెలుస్తుందన్నారు. విపక్షాల భేటీకి ముందు సదాకత్ ఆశ్రమం ఏరియాలోని పార్టీ ఆఫీస్​లో కార్యకర్తలు, లీడర్లను ఉద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు. దేశాన్ని విభజించి.. విద్వేషం, హింసను వ్యాప్తి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. కాంగ్రెస్ సామాన్యుడి వెనుక ఉంటే.. బీజేపీ మాత్రం కేవ‌‌లం ఇద్దరు ముగ్గురు అత్యంత సంప‌‌న్నులు, బ‌‌డా పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తున్నదని మండిప‌‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌‌ఏ బీహార్‌‌లో ఉందని పేర్కొన్నారు. విభేదాలు పక్కనపెట్టి 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని మల్లికార్జున ఖర్గే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘ఇది సిద్ధాంతాలకు సంబంధించిన యుద్ధం. వాస్తవానికి తమ మధ్య విభేదాలున్నాయి. కానీ, 2024 ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం”అని ప్రతిపక్షాల జాయింట్ కాన్ఫరెన్స్​లో రాహుల్ అన్నారు.

భేటీలో ఆప్ వర్సెస్ కాంగ్రెస్

ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించే వరకూ ఫ్యూచర్​లో జరిగే ప్రతిపక్ష భేటీల్లో భాగస్వాములు కాబోమని ఆప్ లీడర్లు స్పష్టం చేశారు. విపక్షాల సమావేశంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆర్డినెన్స్ అంశంపై కాంగ్రెస్ వైఖరి అడిగారు. దీనిపై ఖర్గే ఘాటుగానే స్పందించారు. బీజేపీతో ఒప్పందం కారణంగా కాంగ్రెస్ వైఖరి తీసుకోవడం లేదని ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆరోపించడం సరికాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడం లేదా సమర్థించడం పార్లమెంటు లోపల ఉంటుందని, సమావేశాలు ప్రారంభమైనప్పుడు దాని గురించి అన్ని పార్టీలు కలిసి చర్చిస్తాయని, కానీ, ఇప్పుడు ఇలాంటి పబ్లిసిటీ ఎందుకని ఖర్గే అన్నారు. చివరికి జాయింట్ ప్రెస్​కాన్ఫరెన్స్​లో పాల్గొనకుండానే అరవింద్ కేజ్రీవాల్ వెళ్లిపోయారు.