ముఖ్య అతిథిగా వచ్చి.. ఆర్గానిక్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించిన గోమాత

ముఖ్య అతిథిగా వచ్చి.. ఆర్గానిక్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించిన గోమాత

ఓ ఆవు ఆర్గానిక్ రెస్టారెంట్‌ ను ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. సాధారణంగా చాలా మంది తమ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి సెలబ్రిటీలను, లేకుంటే ముఖ్య అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆవును అతిథిగా ఆహ్వానించి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఒక ఆవు ముఖ్య అతిథిగా వచ్చి ఆర్గానిక్‌ రెస్టారెంట్‌ ను ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ ‘ఆర్గానిక్ ఒయాసిస్’ పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని ఇక్కడ సర్వ్‌ చేస్తారు. అయితే ఆర్గానిక్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఒక ఆవును తీసుకొచ్చారు. దానితోనే సేంద్రీయ రెస్టారెంట్‌ను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆ ఆవుపై పచ్చని వస్త్రం కప్పారు. దానికి సేంద్రీయ ఆహారం తినిపించారు. 

గౌరవ అతిథిగా గోమాత

దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆవులపై ఆధారపడి ఉన్నాయని ‘ఆర్గానిక్ ఒయాసిస్’ రెస్టారెంట్‌ మేనేజర్‌, మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ అన్నారు. అందుకే తమ ఆర్గానిక్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా గోమాతను ఎంచుకున్నట్లు చెప్పారు. సాధారణంగా జనమంతా ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించిన వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా పొందుతున్నారని తెలిపారు. దేశంలో సొంతంగా ఏర్పాటు చేసిన సేంద్రీయ ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఉన్న మొదటి రెస్టారెంట్ తమదేనని అన్నారు. ఈ ఆహారం తీసుకున్న తర్వాత, ఇతర ఆహారాల మధ్య తేడాను కస్టమర్లు గమనిస్తారని, ఆ తర్వాత సేంద్రీయ ఫుడ్‌ను మరింతగా డిమాండ్‌ చేస్తారని ఆయన వెల్లడించారు.  ఆవుల మీద ఆధారపడి ఉన్నందున తాను గౌరవ అతిథిగా ‘గోమాత’ను ఎంచుకున్నట్లు చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో  ఏర్పాటైన మొట్టమొదటి ఆర్గానిక్ రెస్టారెంట్ కు ప్రత్యేకత ఉంది. అందుకే  దానికి ఆర్గానిక్ ఒయాసిస్అనే పేరు పెట్టారు. ఇందులో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే కస్టమర్లకు ఇవ్వనున్నారు.