సీతారాముల పర్ణశాల మునిగిపోతది

సీతారాముల పర్ణశాల మునిగిపోతది
  • దుమ్ముగూడెం కొత్త బ్యారేజతో ముంపు తప్పదని ఇంజనీర్ల హెచ్చరిక
  • 6 కిలోమీటర్ల భారీ కరకట్ట కడితేనే సేఫ్​
  • 6 మీటర్ల వెడల్పు, 68 మీటర్ల ఎత్తుతో కట్టాలని డీపీఆర్​లో వెల్లడి
  • లేకుంటే ఆలయానికి దారి కూడా ఉండదు… ముంపుపై భక్తుల్లో ఆందోళన
  • ప్రస్తుత ఆనకట్టకు 200 మీటర్ల దిగువన కొత్త బ్యారేజీకి డిజైన్​
  • అదనంగా వెయ్యికోట్లు పెరిగిన అంచనా వ్యయం

హైదరాబాద్, వెలుగు:

దుమ్ముగూడెం వద్ద నిర్మించబోయే కొత్త బ్యారేజీతో పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని ‘పర్ణశాల’  ప్రాంతం మునిగిపోనుంది. అక్కడున్న పంచవటి కుటీరంతో పాటు సీతమ్మవారి నార చీరల ప్రాంతం పూర్తిగా జల సమాధి కానుంది. ఇక్కడి సీతారాముల ఆలయానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు కూడా గోదారి పాలవుతుంది. రాష్ట్ర ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ తయారు చేయించిన దుమ్ముగూడెం ‘డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)’లోనే ఈ విషయం స్పష్టమైంది. పర్ణశాల ఆలయం మునిగిపోకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలను అందులో ప్రతిపాదించారు.

ఆరు కిలోమీటర్ల పొడవునా ఆరు మీటర్ల వెడల్పుతో గోదావరి నది అడుగుభాగం నుంచి 68 మీటర్ల ఎత్తుతో భారీ కరకట్ట (ప్రొటెక్షన్​ బండ్) నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంత భారీగా కట్ట కడితే తప్ప పర్ణశాల ఆలయానికి ముంపు తప్పదని పేర్కొన్నారు. గతంలో పోలవరం నిర్మాణంతోనే భద్రాద్రి రామాలయానికి ముప్పు ఉందని పరిసర ప్రాంతాల జనంలో ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు దాని ఎగువన కట్టే దుమ్ముగూడెంతో మరో ముప్పు తరుముకొస్తోందని పర్ణశాల పరిసర గ్రామాల ప్రజలు కలవరపడుతున్నారు.

పాత ఆనకట్టకు దిగువన బ్యారేజీ

దుమ్ముగూడెం వద్ద గోదావరికి అడ్డంగా ప్రస్తుతమున్న ఆనకట్టను 1865లో సర్​ ఆర్థర్​ కాటన్‍ నిర్మించారు. అక్కడ రిజర్వాయర్​ లెవల్​ 49.69 మీటర్లుకాగా 1.3 టీఎంసీల నీరు నిల్వ ఉంటోంది. ఇప్పుడు దానికి 200 మీటర్ల దిగువన గోదావరిపై కొత్త బ్యారేజీని డిజైన్​ చేస్తున్నారు. గత నెల11న జరిగిన కేబినెట్​భేటీలో ఈ కొత్త ప్రాజెక్టును ఆమోదించారు. జల విద్యుదుత్పత్తికి, గోదావరిలో నీటి నిల్వకు ఉపయోగపడేలా నిర్మిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో 150 రోజులపాటు పుష్కలంగా నీటి ప్రవాహం ఉంటుందని.. అందుకే 37 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంటు నిర్మిస్తామని తెలిపారు. నెల రోజుల్లోనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు డీపీఆర్​ సిద్ధం చేశారు. అందులోని ప్రాజెక్టు డిజైన్లు, టెక్నికల్ అంశాలు, నీటి లభ్యత, నిల్వ, ముంపు అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డీపీఆర్​లో పేర్కొన్న మేరకు 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా హైడల్​ ప్రాజెక్టు కట్టేందుకు 63 మీటర్ల మేర ఎత్తున బ్యారేజీని ప్రతిపాదించారు. 70 రేడియల్​ గేట్లు, 1,395 మీటర్ల పొడవైన బ్యారేజీ నిర్మాణానికి వీలుగా డీపీఆర్​ రెడీ అయింది.

భారీ ముంపు ఖాయం

దుమ్ముగూడెం మండలంలో ఉన్న పర్ణశాల గోదావరికి ఎడమ గట్టున ఉంది. ప్రస్తుత పాత ఆనకట్టకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. రామాయణ కావ్యం ప్రకారం అరణ్యవాసంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలోనే సంచరించి, పంచవటి కుటీరాన్ని నిర్మించుకున్నారు. ఆ పక్కనే ఛత్తీస్​గఢ్​ ప్రాంతం నుంచి వచ్చే సీతమ్మవాగు ప్రవహిస్తుంది. అక్కడే సీతారాముల ఆలయం, కొద్దిదూరంలో సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీరల ప్రాంతం ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యంతోపాటు పుణ్యక్షేత్రం కావటంతో పండుగలు, ఉత్సవాల సమయంలో పర్ణశాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన బ్యారేజీలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరితే.. పర్ణశాల గ్రామం పాక్షికంగా మునిగిపోతుంది. అక్కడికి వెళ్లే దారి మొత్తం కనుమరుగవుతుందని డీపీఆర్​ స్పష్టం చేసింది.

రూ. వెయ్యి కోట్లు పెరిగిన అంచనా..

దుమ్ముగూడెం ప్రాజెక్టు అంచనా వ్యయం నెల రోజుల్లోనే ఏకంగా రూ. వెయ్యి కోట్లు పెరిగింది. దుమ్ముగూడెం హైడల్​ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,482 కోట్లు ఖర్చవుతుందని, రెండేళ్లపాటు బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని సర్కారు తొలుత ప్రకటించింది. కానీ తాజా డీపీఆర్​లో బ్యారేజీ, పవర్​ ప్లాంట్, భూసేకరణకు కలిపి రూ.4,504 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొత్తం 8,937 ఎకరాలు మునిగిపోతుందని గుర్తించారు. ఈ ప్రాజెక్టు ప్రభావమెలా ఉంటుందనే దానిపై స్థానికుల్లో గుబులు కనిపిస్తోంది.

ఇది మరో పోలవరమే..

దుమ్ముగూడెం బ్యారేజీ ఎత్తు పెంచడం అంటే ఇది మరో పోలవరం ప్రాజెక్టే. గిరిజనులకు ఇదో శాపంగా పరిణమిస్తుంది. దుమ్ముగూడెంతో పాటు చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు మునిగిపోతాయి. పోలవరం బ్యాక్​ వాటర్​తోనే అవి మునుగుతాయంటూ గతంలో చర్ల మండలం తేగడ నుంచి సత్యనారాయణపురం వరకు కరకట్టలు ప్రతిపాదించారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. – సోంది వీరయ్య,  జీవీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి