పాకిస్థాన్ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది మతపరమైన అలవాట్లు, కఠినమైన సామాజిక కట్టుబాట్లు. అయితే ఆ దేశంలో ఒక ఊహించని సీక్రెట్ దాగి ఉందంటూ ప్రముఖ పాకిస్థానీ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ హీనా బలోచ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచమంతటా చక్కర్లు కొడుతున్నాయి. "పాకిస్థాన్‌లో ఎవరూ స్ట్రెయిట్ కాదు" అంటూ ఆమె బాంబు పేల్చారు. పాక్ లోని 80 శాతం మంది ప్రజలు స్వలింగ సంపర్కులు(Gay) అని.. మిగిలిన 20 శాతం మంది బై సెక్సువల్స్(Bisexuals) అని ఆమె లెక్కలతో సహా చెప్పడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
పాక్ సమాజంలో జనం బయటకు మతం గురించి, సంప్రదాయాల గురించి మాట్లాడుతుంటారని హీనా క్వీర్ గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చీల్చి చెండాడారు. ఫ్యామిలీ గౌరవం అని డబ్బా కొట్టుకుంటారని, కానీ లోపల మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందన్నారు. ఇదొక ఓపెన్ సీక్రెట్ అంటూ ఒక్క మాటలో పాకిస్థాన్ ప్రజల గురించి హీనా తేల్చేశారు. అక్కడ నూటికి నూరు శాతం మంది తమ లైంగికతను దాచుకుంటున్నారు తప్ప.. ఎవరూ స్ట్రెయిట్ కాదు అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్‌లో పెరిగిన తాను.. అక్కడ అడుగడుగునా చూసిన అనుభవాలతోనే ఈ మాట చెబుతున్నట్లు వివరించారు.
హీనా బాల్యం కూడా కన్నీళ్ల మధ్యే సాగింది. తన లైంగికత కంటే తన వేషధారణ గురించి ఆమె ఎక్కువగా భయపడేవారు. పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుంటే ఇంట్లో వారు ఏమంటారు? ఆడపిల్లలా నగలు ధరిస్తే ఎన్ని దెబ్బలు పడతాయి? అన్నదే తనకు పెద్ద ఆందోళనగా ఉండేదని తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని.. వారు కేవలం అడుక్కోవటం, డ్యాన్స్, సెక్స్ వర్క్‌కే పరిమితం కావాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు హీనా.
హీనా చేసిన ఈ కామెంట్స్.. ఆమె చేసిన పోరాటాలు పాక్ పాలకులకు మింగుడు పడలేదు. నిరసనలో 'ప్రైడ్ ఫ్లాగ్' ఎగురవేసినందుకు ఆమెపై దాడులు జరిగాయి. కిడ్నాప్ చేసి వేధించారు. చివరికి ప్రాణ భయంతో దేశం దాటి లండన్‌కు పారిపోయిన హీనా.. ఇప్పుడు అక్కడ శరణార్థిగా ఉంటూ పాకిస్థాన్ అసలు రంగును బయటపెడుతున్నారు. అణచివేత ఎక్కువగా ఉన్నచోట వికృతమైన రహస్యాలు కూడా ఎక్కువే ఉంటాయని హీనా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు హీనా చేసిన 80:20 ఫార్ములా కామెంట్స్ పాక్ గడ్డపై పెద్ద దుమారాన్నే రేపుతోంది.
