దివాళా తీసిన పాకిస్థాన్: ఎంపీలు, మంత్రులకు జీతాలు కట్.. ఇక దేశాన్ని అమ్మేయటమే అంటున్న ఆర్థికవేత్తలు

దివాళా తీసిన పాకిస్థాన్: ఎంపీలు, మంత్రులకు జీతాలు కట్.. ఇక దేశాన్ని అమ్మేయటమే అంటున్న ఆర్థికవేత్తలు

పాకిస్థాన్ దేశం దివాళా తీసింది. అవును.. నిజం.. అధికారికంగా కాకపోయినా.. అనధికారికంగా ఇదే జరిగింది. 2026, మార్చి 3వ తేదీ అర్థరాత్రి.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షరీఫ్ అర్థరాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. ఎంపీలు, మంత్రులకు జీతాలు ఇవ్వలేం.. ఇచ్చేది లేదని ప్రకటించారు. ఇదే సమయంలో UAE నుంచి తీసుకున్న 2 బిలియన్ డాలర్ల అప్పును వెంటనే.. అర్జంట్ గా కట్టాలంటూ పీకలపై కూర్చుకున్నారు.. మా దగ్గర చిల్లిగవ్వ లేదు.. అందుకే ఎంపీలు, మంత్రుల జీతాలు కట్ చేస్తున్నాం అని ప్రకటించటం సంచలనంగా మారింది. 

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం. పాక్ తన క్యాబినెట్ మంత్రులకు కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని దీనావస్థకు చేరుకుందనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి.. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని షరీఫ్ అర్ధరాత్రి పూట జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని సంచలన నిర్ణయాలను ప్రకటించారు. దీనికి ముందు ప్రభుత్వ సంస్థల్లోని సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో దాదాపు 30 శాతం వరకూ తగ్గింపులకు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే.

మొన్నటి వరకు కేవలం రెండు నెలల పాటు మంత్రుల జీతాలు నిలిపివేయాలని భావించిన పాక్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ గడువును ఏకంగా 6 నెలలకు పెంచింది. అంటే రానున్న అర ఏడాది పాటు పాక్ ఫెడరల్ మంత్రులెవరూ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకూడదని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం జీతాలే కాదు.. మంత్రులకు ఇచ్చే లగ్జరీ ప్రోత్సాహకాలు, విదేశీ పర్యటనలు, ఇతర విలాసాలపై కూడా భారీగా కోత విధించారు. ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. సొంత మంత్రులకే "ఉచిత సేవలు" చేయాలని ప్రధాని తేల్చి చెప్పడం ఆ దేశ ఆర్థిక దివాళాకు పరాకాష్టగా నిలుస్తోంది.

మరోవైపు పాకిస్థాన్ లో మండిపోతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్ లెవీని ఏకంగా రూ.80 తగ్గించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరల వల్ల జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని, కనీసం నెల రోజుల పాటు ధరల్లో ఎటువంటి మార్పు ఉండబోదని షరీఫ్ హామీ ఇచ్చారు. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే, ఇప్పటికే దివాళా అంచున ఉన్న పాక్ ఈ భారాన్ని ఎలా భరిస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

పాకిస్థాన్ ప్రస్తుతం IMF నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని అంతర్జాతీయ సంస్థలు పెట్టిన నిబంధనలే మంత్రుల జీతాల కోతకు దారి తీశాయి. గతంలో చేసిన అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు కట్టేందుకు కూడా డబ్బు లేక కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాయాది దేశానికి. దీంతో పాకిస్థాన్ పరిపాలన గందరగోళంలో పడిపోయింది. ఒకప్పుడు ఆడంబరాలకు వెనుకాడని పాక్ పాలకులు.. నేడు జీతాలు కూడా పొందలేని స్థితికి చేరుకోవడం అక్కడి వాస్తవ ఆర్థిక పరిస్థితులను సూచిస్తోందంటున్నారు నిపుణులు.