న్యూఢిల్లీ: ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ అధికారిక నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ ఇంటి ఎదుట మెరుపు ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో మోడీ నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో దాదాపు దాదాపు మూడున్నర గంటల పాటు మోడీ నివాసం దగ్గర హైడ్రామా నడిచింది.
కాంగ్రెస్ మెరుపు ధర్నా:
పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (జులై 21) ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి యత్నించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఇంటి దగ్గరలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ప్రధాని మోడీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలో భాగమైన కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గొంతెత్తితే బేడీలు వేసి బంధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
రాహుల్‌తో కేంద్ర మంత్రి చర్చలు:
మోడీ ఇంటి దగ్గర ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా ధర్నా విరమించాలని రాహుల్ గాంధీని ఆయన కోరారు. అయితే, ధర్నా విరమించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు పెట్టింది. తమ డిమాండ్లపై కేంద్ర స్పష్టమైన ప్రకటన చేస్తే ధర్నా విరమిస్తామని రాహుల్ తెలిపారు.
అప్పటి వరకు ప్రధాని మోడీ ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాహుల్‌తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేరుగా అమిత్ షా దగ్గరకు వెళ్లి ఆయనను కలిశారు. కాంగ్రెస్ డిమాండ్ల గురించి అమిత్ షాతో చర్చించారు. అమిత్ షాతో భేటీ అనంతరం మళ్లీ కాంగ్రెస్ ధర్నా స్థలానికి చేరుకుని రాహుల్‌తో జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ డిమాండ్ మేరకు.. నీట్ పేపర్ లీక్, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ గురించి పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. అదే తమ ప్రధాన డిమాండ్ అని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్ తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమి లేక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో మోడీ నివాసం ఎదుట హై టెన్షన్ నెలకొంది.
