బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం మోదీ.. : రాహుల్ గాంధీ

బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం మోదీ.. : రాహుల్ గాంధీ

 

  •     స్టూడెంట్స్​పై లాఠీచార్జ్ అన్యాయమని ఫైర్​
  •     పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేరా?
  •     నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో ఖర్గే మండిపాటు
  •     ఎన్డీయేకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదని ఆగ్రహం
  •     అయోధ్య విరాళాల చోరీకి ప్రధానిదే బాధ్యతని కామెంట్
  •     నిధుల గోల్​మాల్​పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్​

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్​‘యాంటీ యూత్’ పీఎం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అన్యాయం చేయడంతో పాటు వారిపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. సోమవారం పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతూ వేలాదిమంది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యార్థులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించారు. నిరసనకారులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్​గ్యాస్​ ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.

పోలీసుల దెబ్బలకు గాయపడిన విద్యార్థుల వీడియోను జత చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఫెయిలైన ధర్మేంద్ర ప్రధాన్​తో కనీసం రాజీనామా చేయించలేని వీక్ ప్రధాని మోదీ అని రాహుల్​ ఎద్దేవా చేశారు. దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని మండిపడ్డారు. చదువు, భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీదెబ్బలు, అరెస్టులు బహుమతిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్లు లీక్ నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, న్యాయం కోసం గొంతెత్తిన విద్యార్థులను చితక్కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవు పలికారు. మన విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యాసంస్థలన్నీ ఒకే ఒక్క సంస్థ చేతుల్లో నడుస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. దీనిపైనే దేశ యువత తిరగబడుతోందని, వారి డిమాండ్లను ప్రధాని వెంటనే అంగీకరించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీ కేవలం ‘అసత్యం, హింస’ అనే భారత్‌‌ వ్యతిరేక సూత్రాలను నమ్ముతూ యువతను అవమానిస్తున్నారని విమర్శించారు.