వాతావరణం చల్లగా ఉందని, దప్పిక లేదని నీళ్లు తాగడం తగ్గించేశారా..? అయితే మీ కిడ్నీలు..

వాతావరణం చల్లగా ఉందని, దప్పిక లేదని నీళ్లు తాగడం తగ్గించేశారా..? అయితే మీ కిడ్నీలు..

డీహైడ్రేషన్ సమస్య ఎండా కాలం మాత్రమే ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. వర్షా కాలం, శీతా కాలం దాహార్తి తక్కువగా ఉందని నీళ్లు తాగే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. చల్లటి వాతావరణం కారణంగా నీళ్లు కూడా దప్పిక కావు. కానీ.. వర్షాకాలమైనా, శీతా కాలమైనా నీళ్లు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు.

డీహైడ్రేషన్ మూత్రపిండాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వానా కాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతూనే ఉంటుంది. చెమట నెమ్మదిగా ఆవిరైపోతుంది కాబట్టి, ఎంత నీటిని మనం కోల్పోతున్నారో మనం గ్రహించలేని పరిస్థితి ఉంటుంది.

వానా కాలంలో చల్లగా అనిపించినప్పటికీ.. నీళ్లు తాగే విషయంలో అశ్రద్ధ పనికిరాదని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి సరిపడినన్ని నీళ్లు తాగకపోతే కిడ్నీ సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య కూడా నీళ్లు తక్కువగా తాగే వారిలోనే ఎక్కువగా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. వర్షా కాలంలో మనకు తెలియకుండానే శరీరం డీహైడ్రేషన్ బారిన పడొచ్చని, మూత్రపిండాలపై దాని ప్రభావం చాలా కాలం తర్వాత తెలిసే అవకాశం ఉందని చెప్పారు.

వర్షా కాలంలో కూడా కిడ్నీలు సేఫ్గా ఉండాలంటే వేసవిలో తాగిన తరహాలోనే నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దాహంగా అనిపించకపోయినా అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి అయినా నీళ్లు తాగాలని సూచించారు.

డీహైడ్రేషన్.. అంటే ఒంట్లో నీరు తగ్గిపోయి మనిషి నీరసించిపోయే పరిస్థితి. ఎండా కాలం ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కొబ్బరి బోండాలు, జ్యూసులు, కూల్ డ్రింకులు, నిమ్మ కాయ నీళ్లు.. ఇలా ఎవరికి అందుబాటులో ఉన్న పానీయాలు వాళ్లు తాగుతుంటారు. ఎండల కారణంగా ఉక్కపోత బారిన పడి ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. శరీరం ఇలా డీహైడ్రేట్ అయితే నీరసించి పోయి వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.