పసుపు రైతును ముంచిన వానలు

పసుపు రైతును ముంచిన వానలు

మెట్​పల్లి, వెలుగు: ఈ యేడు కురిసిన వానలు వరి రైతులనే కాదు.. పసుపు రైతులనూ నిండా ముంచాయి. చేలల్లో నీళ్లు నిలిచి పంటకు మర్రాకు తెగులు, దుంప కుళ్లు సోకాయి. అవి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒకేసారి రెండు తెగుళ్లు అటాక్​అవ్వడంతో రైతులు దిగాలు పడ్డారు. ఎకరాకు లక్షా ఇరవై వేలు దాకా ఖర్చయిందని, కనీసం అదైనా వస్తోందో లేదో తెలియట్లేదని వాపోతున్నారు. దుంపకుళ్లుతో భూమిలోని కొమ్ము పిలకలు మురిగిపోయాయి. ఈ సమస్య సాళ్ల పద్ధతిలో వేసిన తోటల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఎత్తు మడుల్లో వేసిన వాటిలో నష్టం తక్కువగా ఉంది. జగిత్యాల జిల్లాలో ఈసారి 23 వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా.. 80 శాతం మంది రైతులు సాళ్ల పద్ధతిలో వేశారు. ఐదారేళ్లుగా పంట దిగుబడులు బాగున్నా మంచి ధర దక్కలేదు. గతేడాది దిగుబడికి తగ్గ డిమాండ్​ఉండడంతో రైతులు లాభపడ్డారు.

క్వింటాల్​పసుపు రూ.7 వేల వరకు పలికింది. క్వాలిటీ ఉన్న పంట రూ.9 వేలు నుంచి-10 వేల మధ్య అమ్ముడుపోయింది. దీంతో ఈసారి ప్రతిరైతు గతేడాది కంటే ఎకరం అదనంగానే వేశారు. కానీ జులై, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు దుంపకుళ్లు, ముర్రాకు తెగులు సోకి జిల్లాలో 50 నుంచి 60 శాతం పసుపు పంట దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. దాదాపు15 వేల ఎకరాల్లో దుంపకుళ్లు సోకినట్లు అంచనా వేస్తున్నారు. మరో నెల రోజుల్లో కొమ్ముల తవ్వకాలు షురూ అవుతాయి. గత ఏడాది లాగానే పసుపుకు రేటు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెగుళ్లు ఏం లేకుంటే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, దుంపకుళ్లు సోకడంతో ఎకరాకు 10 క్వింటాళ్లు కంటే తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ముర్రాకు తెగులు సోకి పంటలో ఎదుగుదల తగ్గిందంటున్నారు.

15 రోజులకోసారి.. 2 సార్లు..
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దుంపకుళ్లు, ముర్రాకు తెగుళ్లను నివారించవచ్చు. తెగులు లక్షణాలు గమనించి లీటరు నీటికి గ్రాము మెటాలాక్సిల్ + మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌‌ను కలిపి మొక్కలపై, మొదళ్లు తడిచేలా పోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి నెలలో రెండు సార్లు పిచికారీ చేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో అవసరమైన మందులు వినియోగించాలి. పల్లెల్లో పర్యటించి రైతులకు సూచనలు చేస్తాం. -ప్రతాప్ సింగ్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్, జగిత్యాల

ఈయేడు పంట పోయినట్లే
రెండెకరాల్లో పసుపు వేశాను. భారీ వర్షాలకు తోటలో నీరు నిలిచింది. దుంపకుళ్లు కారణంగా మొక్క ఎదగలేదు. నేల లోనే కొమ్ము కుళ్లుతోంది. గతేడాది ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగు బడి వచ్చింది. ఈసారి అందులో సగమైనా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి రావడమూ కష్ట మే. ఈసారి పంట పోయినట్లే. అధికారుల నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు అందడం లేదు.
- బొడ్ల ఆనంద్, రైతు, మెట్ పల్లి