1368 కోట్ల పెట్టుబడికి 15 కంపెనీల అంగీకారం

1368 కోట్ల పెట్టుబడికి 15 కంపెనీల అంగీకారం

న్యూఢిల్లీ: అదానీ కాపర్ ట్యూబ్స్, ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్, విప్రో ఎంటర్‌‌ప్రైజెస్ సహా దాదాపు 15 కంపెనీలను వైట్ గూడ్స్ రంగానికి పీఎల్‌‌ఐ స్కీమ్​ కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఈ పథకం కింద ఇవి రూ. 1,368 కోట్ల పెట్టుబడి పెడతాయి. ఈ ఏడాది మార్చిలో  కేంద్ర వాణిజ్యం  పరిశ్రమల మంత్రిత్వ శాఖ  రూ. 6,238 కోట్ల  వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్‌‌ఈడి లైట్లు) పిఎల్‌‌ఐ స్కీమ్ కోసం అప్లికేషన్లను ఆహ్వానించింది.

పోయిన సంవత్సరం, డైకిన్, పానాసోనిక్, సిస్కా  హావెల్స్‌‌తో సహా 46 సంస్థలు రూ. 5,264 కోట్ల పెట్టుబడితో మొదటి రౌండ్‌‌లో ఈ స్కీమ్‌‌కు ఎంపికయ్యాయి. రెండో రౌండ్‌‌లో 19 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో నాలుగు కంపెనీలు -- రూ. 100 కోట్ల పెట్టుబడికి హామీ ఇచ్చాయి. వీటిలో జెకో ఎయిర్‌‌కాన్, ఈఎంఎం ఈఎస్​ఎస్​ ఎయిర్‌‌కాన్ (రూ. 52 కోట్లు), స్పీడోఫర్ ఇండియా (రూ. 18 కోట్లు),  సిమోకో టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ (రూ. 10.63 కోట్లు) ఉన్నాయి. ఈ 15 సంస్థల్లో తొమ్మిది కంపెనీలు రూ. 908 కోట్లను ఏసీ విడిభాగాల తయారీకి ఖర్చు చేస్తాయి.

మిగతా ఆరు కంపెనీలు  రూ. 460 కోట్లను ఎల్‌‌ఈడీ లైట్ కాంపోనెంట్ల తయారీకి వాడుతాయి. ఇవి ఐదేళ్లలో రూ. 25,583 కోట్ల విలువైన ప్రొడక్టులను తయారు చేస్తాయి. దీంతో 4,000 మందికి ఉపాధి దొరుకుతుంది. భారతదేశంలోని ఏసీలు,  ఎల్​ఈడీ లైట్ పరిశ్రమల కోసం పూర్తి కాంపోనెంట్ ఎకోసిస్టమ్‌‌ను రూపొందించడానికి, గ్లోబల్​ సప్లై చెయిన్​లో ఇండియా ఎదగడానికి  వైట్​ గూడ్స్​పై ప్రొడక్షన్​లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్​ఐ) స్కీమును ప్రకటించారు.

అదానీ కాపర్ ట్యూబ్స్ (రూ. 408 కోట్ల పెట్టుబడి), ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా (రూ. 300 కోట్లు), మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా,  కేన్స్ టెక్నాలజీ ఇండియా (ఒక్కొక్కటి రూ. 50 కోట్లు) కూడా ఈ స్కీముకు   ఎంపికయ్యాయి. జిందాల్ పాలీ ఫిల్మ్స్ (రూ. 360 కోట్లు), సహస్ర సెమీకండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 20 కోట్లు), విప్రో ఎంటర్‌‌ప్రైజెస్ (రూ. 12 కోట్లు), క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ (రూ. 10.15 కోట్లు) కూడా సెలెక్ట్​ అయ్యాయి.