తేజస్‌‌ యుద్ధ విమానంలో మోదీ రైడ్!

తేజస్‌‌ యుద్ధ విమానంలో మోదీ రైడ్!

బెంగళూరు: దేశీయంగా తయారైన యుద్ధ విమానం తేజస్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. శనివారం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌‌ ఫెసిలిటీలో ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా లైట్ కాంబాట్ ఫైటర్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ ‘తేజస్’ రైడ్‌‌కు వెళ్లారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌‌‌‌ ద్వారా మోదీ వెల్లడించారు. ‘‘తేజస్‌‌లో ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశా. ఈ అనుభవం.. స్వదేశీ సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని మరింత పెంచింది అని ట్వీట్ చేశారు.

ఈరోజు తేజస్‌‌లో ఎగురుతున్నా.. సెల్ఫ్ రిలయన్స్‌‌లో మనం ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాదని గర్వంగా చెప్పగలను. ఐఏఎఫ్​, డీఆర్‌‌‌‌డీవో, హెచ్‌‌ఏఎల్, భారతీయులకు నా హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు. నిజానికి తేజస్.. సింగిల్ సీట్ ఎయిర్ క్రాఫ్ట్. ప్రధాని ప్రయాణించినది 2 సీట్లున్న ట్రైనర్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌. ఇందులో మోదీ వెనుక కూర్చోగా.. పైలట్​ ముందు కూర్చుని నడిపారు.

ఫొటో మాస్టర్ క్రెడిట్ తీసుకుంటుండు: కాంగ్రెస్

మోదీ తేజస్‌‌ ప్రయాణంపై కాంగ్రెస్ మండిపడింది. ‘‘దశాబ్దాలపాటు బలంగా నిర్మించుకున్న మన దేశీ సైంటిఫిక్, టెక్నలాజికల్ కెపాసిటీకి తేజస్ మరో ట్రిబ్యూట్. 1984లో స్థాపించిన ఏరోనాటికల్ డెవలప్‌‌మెంట్ ఏజెన్సీ.. తేజస్‌‌ను డిజైన్ చేసింది. 2011లో ఆపరేషన్ క్లియరెన్స్ వచ్చింది. 2014కు ముందు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు, కృషిని గుర్తించడం వల్ల ‘ఎన్నికల ఫొటో మాస్టర్’కు అయ్యే ఖర్చేమీ లేదు. నిజానికి ఆయన క్రెడిట్‌‌ తీసుకోవడానికి ఇది చాలా అవసరం కూడా” అని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.