మనోళ్ల పెండ్లిళ్లు విదేశాల్లో ఎందుకు? మన్​కీ బాత్​లో ప్రధాని మోదీ

మనోళ్ల పెండ్లిళ్లు విదేశాల్లో ఎందుకు? మన్​కీ బాత్​లో ప్రధాని మోదీ
  • కొన్ని పెద్ద ఫ్యామిలీలు కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నయి
  • మన దేశంలోనే  అలాంటి వివాహ వేడుకలు ఎందుకు చేయకూడదు?
  • దేశం డబ్బు విదేశాలకు తరలిపోవద్దు
  • పెండ్లి షాపింగ్‌‌లో మేడిన్ ఇండియా ప్రొడక్టులకు ప్రాధాన్యమివ్వాలి

న్యూఢిల్లీ: కొన్ని పెద్ద కుటుంబాలు తమ పెండ్లి వేడుకలను విదేశాల్లో చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మన దేశంలోనే పెండ్లిళ్లు జరుపుకోవాలని, దేశం డబ్బు విదేశాలకు తరలిపోకూడదని అన్నారు. ఆదివారం మన్‌‌ కీ బాత్‌‌లో ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్ నడుస్తున్నది. ఈ సీజన్‌‌లో రూ.5 లక్షల కోట్ల బిజినెస్ నడుస్తుందని కొన్ని ట్రేడ్ ఆర్గనైజేషన్లు చెప్తున్నాయి. పెండ్లి షాపింగ్ చేసే సమయంలో.. మేడిన్ ఇండియా ప్రొడక్టులకు మీరు ప్రాధాన్యమివ్వాలి” అని ఆయన కోరారు.

వివాహాలకు సంబంధించి ఓ విషయం నన్ను చాలాకాలంగా కలవరపెడుతున్నది. ఈ విషయంలో నేను పడుతున్న బాధ గురించి నా కుటుంబ సభ్యులతో కాక ఇంకెవరితో చెప్పుకోగలను. ఒక్కసారి ఆలోచించండి.. కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెండ్లిళ్లు చేసుకునే కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అవసరమా? భారతదేశ గడ్డపై, ప్రజల మధ్య వివాహ వేడుకలు జరుపుకుంటే.. ఇక్కడి డబ్బు ఇక్కడే ఉంటుంది. ఇలా చేయడం వల్ల దేశ ప్రజలకు ఏదో ఒక సేవ చేసే అవకాశం లభిస్తుంది. 

మీరు ‘వోకల్ ఫర్ లోకల్’ మిషన్‌‌ను విస్తరించగలరా? మన దేశంలో ఇలాంటి వివాహ వేడుకలను ఎందుకు నిర్వహించకూడదు?’’ అని మోదీ ప్రశ్నించారు. “మీరు కోరుకునే వ్యవస్థ ఈ రోజు ఇక్కడ ఉండకపోవచ్చు.. కానీ మనం అలాంటి ఈవెంట్లను నిర్వహిస్తే.. వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది చాలా పెద్ద కుటుంబాలకు సంబంధించిన విషయం. నా ఈ బాధ ఆ పెద్ద కుటుంబాలకు చేరుతుందని ఆశిస్తున్నా” అని ప్రధాని అన్నారు.

ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదు

ఓ దేశ నిర్మాణ బాధ్యతలను భారీ సంఖ్యలో ప్రజలు తీసుకుంటే.. ఆ దేశం ముందుకు సాగకుండా ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదని ప్రధాని అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఎన్నో ట్రాన్స్‌‌ఫార్మేషన్స్‌‌కు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ‘‘ఇందుకు ఈ ఏడాది పండుగల సీజనే ఓ ఉదాహరణ. ఓకల్ ఫర్ లోకల్‌‌ గురించి గత మన్‌‌కీ బాత్‌‌లో నేను ప్రస్తావించాను. 

స్థానిక ఉత్పత్తులనే కొనమని కోరాను. కొన్ని రోజుల వ్యవధిలోనే రూ.4 లక్షల కోట్లకు పైగా వ్యాపారం దేశంలో జరిగింది. ఇందులో మేడిన్ ఇండియా ప్రొడక్టులకే ప్రజలు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు పిల్లలు కూడా షాపులో ఏదైనా కొనడానికి వెళ్తే.. ‘మేడిన్ ఇండియా’నా? కాదా? అని చెక్ చేస్తున్నారు. అంతేకాదు.. జనం ఆన్‌‌లైన్‌‌లో ఏదైనా ప్రొడక్ట్ కొనగోలు చేసినా.. ఎక్కడ తయారైందనే విషయాన్ని చెక్ చేసుకుంటున్నారు” అని వివరించారు.

టెర్రరిజాన్ని అణచివేస్తున్నం

26/11 ముంబై దాడులకు 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గుర్తు చేసుకున్న ప్రధాని.. అది భారతదేశం ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన టెర్రర్ అటాక్ అని అన్నారు. 2008 ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. ‘‘నవంబర్ 26ను ఎన్నటికీ మరిచిపోలేం. అత్యంత భయంకరమైన టెర్రర్ దాడి జరిగిన రోజు అది. టెర్రరిస్టులు మొత్తం దేశాన్నే షేక్ చేశారు. ఆ దాడుల నుంచి ఇండియా కోలుకోవడం మాత్రమే కాదు. టెర్రరిజాన్ని ధైర్యంగా అణచివేస్తున్నది” అని చెప్పారు. నవంబర్ 26కు మరో ప్రాముఖ్యత ఉందని, భారత రాజ్యాంగాన్ని 1949లో ఇదే రోజున అడాప్ట్ చేసుకున్నారని గుర్తుచేశారు.