రేషన్ కార్డులేని పేదలకూ బియ్యం, క్యాష్ ఇవ్వాలి

రేషన్ కార్డులేని పేదలకూ బియ్యం, క్యాష్ ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు నెలలుగా రేషన్ తీసుకోని వారి రేషన్ కార్డులు రద్దు చేశారని, ఆ కార్డులన్నింటినీ వెంటనే కొనసాగించి బియ్యం ఇవ్వాలని పీసీసీ డిమాండ్ చేసింది. రేషన్ కార్డుల కోసం సుమారు 18 లక్షల మంది దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయని, వారికి కూడా వెంటనే కార్డులు ఇచ్చి రేషన్ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,పీసీసీ కొవిడ్ –-19 టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మర్రిశశిధర్ రెడ్డి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో 87.59 లక్షల రేషన్ కార్డులుండగా.. అందులో ప్రతి ఒక్కరికీ ఫ్రీగా 12 కిలోల చొప్పున బియ్యం, కార్డుకు రూ .1,500 క్యాష్అందజేస్తామని గత నెలలో సీఎం కేసీఆర్ ప్రకటించారని, అయితే ఇంకా కొంత మందికి బియ్యం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు.

కార్డులు లేనిపేదలకు కూడా ఫ్రీ బియ్యం, రూ. 1,500 క్యాష్ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా 5 కిలోల బియ్యం, కిలో పప్పు ఫ్రీగా ఇస్తామని చెప్పిందని, రాష్ట్రంలో వాటిని పంపిణీ చేయలేదని, వెంటనే ప్రారంభించాలని లేఖలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.1500 ఆర్థిక సాయంపై ఆర్థిక మంత్రి హరీశ్​రావు, మున్సి పల్ మంత్రి కేటీఆర్ తలో విధంగా మాట్లాడారని పీసీసీ నేతలు లేఖలో పేర్కొన్నారు . ఈ నెల 13న హరీశ్ రావు మొత్తం 87.59 లక్షల మందికి వారి ఖాతాల్లోకి రూ .1500 బదిలీ అవుతుందని చెప్పారని, కానీ కేటీఆర్ మాత్రం 74 లక్షల మందికి సీఎం ఇచ్చిన వాగ్దానం మేరకు రూ.1500 జమ అవుతుందని ఈ నెల 14న ట్వీట్ చేశారని వారు తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తామనిపేర్కొన్నారు కాంగ్రెస్ నేత‌లు.