ఒలింపిక్స్ జరగాలి..లేదంటే మా కష్టం వృథా

ఒలింపిక్స్ జరగాలి..లేదంటే మా కష్టం వృథా

న్యూఢిల్లీప్రపంచ వ్యాప్తంగా  వేగంగా ప్రబలుతున్న కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్‌‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. దేశాధినేతలు, క్రీడా సంఘాల అధికారుల నుంచి ఆటగాళ్ల వరకూ అందరూ  టోక్యో విశ్వక్రీడలను వాయిదా వేయడమే  ఉత్తమం అంటున్నారు. కానీ, ఇండియా స్టార్‌‌ వెయిట్‌‌ లిఫ్టర్‌‌ మీరాబాయి చాను మాత్రం నిర్ణీత షెడ్యూల్‌‌ ప్రకారమే ఒలింపిక్స్‌‌ జరగాలని అంటోంది. ఒకవేళ ఈ మెగా ఈవెంట్‌‌ రద్దయితే ఒలింపిక్‌‌ పతకం నెగ్గాలన్న తన కల నెరవేరదని అంటోంది. విశ్వ క్రీడల పతకం కోసం ఇన్నాళ్లుగా తాము పడ్డ కష్టం వృథా అవుతుందని వాపోతోంది. టోక్యోపై దృష్టి పెట్టిన మీరాబాయి నాలుగేళ్ల నుంచి తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, ఇప్పుడు  ఒలింపిక్స్‌‌ భవిష్యత్‌‌ ప్రశ్నార్థకంగా మారడంతో మీరాకు ఎటూ పాలుపోవడం లేదు. ‘ఒకవేళ ఒలింపిక్స్‌‌ జరగకపోతే నాలుగేళ్ల మా కష్టం వృథా అవుతుంది. నేనైతే విశ్వక్రీడలు రద్దవ్వాలని అనుకోవడం లేదు. పోటీలు జరగాలని రోజూ ఆ దేవుడిని  ప్రార్థిస్తున్నా.  కేవలం నా కోసమైనా  ఓ ఒలింపిక్‌‌ మెడల్‌‌ నెగ్గాలని అనుకుంటున్నా’ అని మీరాబాయి తెలిపింది.

రియో ఒలింపిక్స్‌‌లో పోటీ పడిన మీరా తీవ్రంగా నిరాశ పరిచింది. క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌లో మూడు ప్రయత్నాల్లో ఒక్క వెయిట్‌‌ కూడా ఎత్తలేకపోయింది. అయితే, టోక్యో ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించిన చాను.. మెగా ఈవెంట్‌‌ ముందుకెళ్లాలని కోరుకుంటోంది. ‘మెడల్‌‌ సాధించాలని నాపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే నేను ఒలింపిక్స్‌‌ రద్దవకూడదని కోరుకుంటున్నా. ట్రెయినింగ్ సహా ఇతర విషయాల గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఒకవేళ మెగా ఈవెంట్‌‌ పోస్ట్‌‌పోన్‌‌ అయినా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. తక్కువ సమయంలోనే ప్లేయర్లకు సంబంధించి ఎన్నో మార్పులు జరుగుతాయ’ని మీరా చెప్పుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఒలింపిక్‌‌ వెయిట్‌‌లిఫ్టింగ్‌‌ క్వాలిఫయింగ్‌‌ షెడ్యూల్‌‌ కూడా దెబ్బతిన్నది. ఆసియా సహా ఐదు కాంటినెంటల్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ను ఇంటర్నేషనల్‌‌ వెయిట్‌‌లిఫ్టింగ్‌‌ ఫెడరేషన్‌‌ రద్దు చేసింది. ఇక, గతేడాది కజకిస్థాన్‌‌లో జరగాల్సిన ఆసియా వెయిట్‌‌లిఫ్టింగ్ చాంపియన్‌‌షిప్‌‌ను తష్కెంట్‌‌లో నిర్వహించారు. ఒలింపిక్స్‌‌కు ముందు మీరాబాయి పోటీ పడ్డ చివరి ఈవెంట్‌‌ ఇది. కానీ, ఇందులో మీరా త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. ఈ టోర్నీ కోసం తాను మెరుగ్గా సన్నద్ధమై బరిలోకి దిగానని చాను చెప్పింది. అయితే, టోర్నీ జరుగుతుందా? లేదా? అనే విషయంలో అనిశ్చితి నెలకొందని తెలిపింది. అప్పటికే తాను ఒలింపిక్స్‌‌కు క్వాలిఫై అయ్యానన్న మీరా.. ఒకవేళ ఆసియా చాంపియన్‌‌షిప్స్‌‌ జరిగితే  బెర్తులపై స్పష్టత వచ్చేదని అభిప్రాయపడింది. ‘నా పెర్ఫామెన్స్‌‌ను మెరుగు పరుచుకొని మరింత ఆత్మవిశ్వాసంతో  ఒలింపిక్స్‌‌కు వెళ్లాలనుకున్నా. ఆసియా టోర్నీ జరిగితే అందుకు నాకు  మంచి వేదిక దొరికేది’అని తెలిపింది.

జాగ్రత్తలు పాటిస్తున్నాం

సెంట్రల్‌‌ స్పోర్ట్స్‌‌ మినిస్టర్‌‌ కిరణ్‌‌ రిజిజు ఆదేశాల మేరకు టోక్యో ఒలింపిక్స్‌‌ అథ్లెట్లు ప్రిపేరయ్యే క్యాంప్స్‌‌ మినహా అన్ని నేషనల్‌‌ క్యాంప్స్‌‌ను వాయిదా వేశారు. అలాగే, నేషనల్‌‌ సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్స్‌‌లెన్స్‌‌, స్పోర్ట్స్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా సెంటర్లను కూడా మూసేశారు. ఈ నేపథ్యంలో వెయిట్‌‌లిఫ్టర్లు ట్రెయినింగ్ తీసుకుంటున్న పటియాలాలోని ఎన్‌‌ఐఎస్‌‌ను కూడా ఖాళీ చేయించారు. కేవలం ఒలింపిక్స్‌‌ కోసం శిక్షణ తీసుకుంటున్న కొద్ది మంది వెయిట్‌‌లిఫ్టర్లే ఎన్‌‌ఐఎస్‌‌లో ఉన్నారని మీరా చెప్పింది. లిఫ్టర్ల కోర్‌‌ గ్రూప్‌‌ మాత్రమే ట్రెయినింగ్‌లో పాల్గొంటోందని, తాము కూడా బయటికి వెళ్లాలంటే భయపడుతున్నామని తెలిపింది. ‘దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌‌ఐఎస్‌‌లో శిక్షణ తీసుకుంటున్న మేం కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాం. ప్రాక్టీస్‌‌ సమయంలో తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నాం.  మమ్మల్ని మేం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటున్నాం’ అని మీరా చెప్పుకొచ్చింది.