మున్సిపోల్స్‌‌కు తయారు కండి

మున్సిపోల్స్‌‌కు తయారు కండి

మున్సిపల్‌‌ కమిషనర్లకు ఈసీ నాగిరెడ్డి ఆదేశం   ఓటర్ల జాబితా తయారీ, కోడ్‌‌ ఆఫ్‌‌ కాండక్ట్‌‌పై సూచనలు

హైదరాబాద్‌‌, వెలుగు: మున్సిపల్‌‌ ఎన్నికలకు సిద్ధం కావాలని, అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌‌ కమిషనర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల కోడ్‌‌ అమలులో కఠినంగా వ్యవహరించాలన్నారు. మంగళవారం ఎస్‌‌ఈసీ ఆఫీసు నుంచి అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, ముసాయిదా ఓటర్ల ప్రకటన, ఫైనల్‌‌ ఫొటో ఎలక్టోరల్‌‌ రోల్‌‌ పబ్లికేషన్‌‌, నోటిఫికేషన్‌‌ జారీ, నామినేషన్ల స్వీకరణపై సూచనలిచ్చారు. అధికారులెవరూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులను వెంటనే తొలగించాలన్నారు. కొత్తవాటికి అనుమతి ఇవ్వొద్దని చెప్పారు.

డేటా మొత్తం రెడీ

మున్సిపోల్స్‌‌ నిర్వహణకు కలెక్టర్లను సమాయత్తం చేసేందుకు ఈ నెల 27న ఎస్‌‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించనుంది. డిస్ట్రిక్ట్‌‌ ఎలక్షన్‌‌ అథారిటీగా కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలు, బ్యాలెట్‌‌ పేపర్ల ముద్రణ తదితరాలపై సూచనలివ్వనుంది. జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వాటిలోని వార్డుల సంఖ్య, ఎన్ని బ్యాలెట్‌‌ పత్రాలు అవసరమో ఇప్పటికే సమాచారం సిద్ధం చేశారు. పోలింగ్‌‌ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, పోలింగ్‌‌కు ముందు మాక్‌‌ పోలింగ్‌‌ ద్వారా మరోసారి శిక్షణనిస్తామని అధికారులు తెలిపారు. పోస్టల్‌‌ బ్యాలెట్ల జారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. ఈ నెల 28న రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలతో నాగిరెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్‌‌ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌, ఏ ఫాం, బీ ఫాంల అందజేతపై చర్చిస్తారు. ఎన్నికల నిర్వహణపై పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటారు.

800 మంది ఓటర్లకో బూత్‌‌

120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, 10 కార్పొరేషన్లలోని 385 డివిజన్లలో ప్రతి 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌‌ బూత్‌‌ ఏర్పాటు చేయనున్నారు. 800 మంది ఓటర్లను సగటుగా తీసుకొని వెయ్యి మంది ఓటర్లున్నా ఆ వార్డుకు ఒకే బూత్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 50 లక్షల మంది ఓటర్లుంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నెల 30న ప్రకటించే డ్రాఫ్ట్‌‌ ఓటరు లిస్టుతో ఓటర్ల లెక్క దాదాపు తేలుతుందని అధికారులు చెబుతున్నారు.

నామినేషన్‌‌ డిపాజిట్లు ఇవే

కౌన్సిలర్‌‌ స్థానానికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్లు రూ.1,250 డిపాజిట్‌‌గా చెల్లించాలి. ఇతరులు రూ.2,500 డిపాజిట్‌‌ చేయాలి. కార్పొరేటర్లుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్లు రూ.2,500, జనరల్‌‌ క్యాండిడేట్లు రూ.5 వేలు చెల్లించాలని అధికారులు చెప్పారు.

మున్సిపాలిటీల్లో లక్ష, కార్పొరేషన్లలో లక్షన్నర

కౌన్సిలర్‌‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి రూ.లక్ష, కార్పొరేటర్‌‌గా పోటీ చేసే వాళ్లు రూ.1.50 లక్షలు ఖర్చు చేయాలి. నోటిఫికేషన్‌‌ జారీ అయిన రోజు నుంచి పోలింగ్‌‌ తేదీ వరకు చేసే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు.

ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ తయారీపై హెల్ప్‌‌ డెస్క్

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారీగా ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ తయారీపై రాష్ట్ర స్థాయిలో హెల్ప్‌‌ డెస్క్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి ఫైనల్‌‌ ఎలక్టోరల్‌‌ పబ్లిష్‌‌ చేసే జనవరి 4 వరకు ఈ డెస్క్‌‌ పనిచేస్తుంది. ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ తయారీలో సందేహాలొస్తే ఎస్‌‌ఈసీలో అసిస్టెంట్‌‌ సెక్రటరీ ఎస్‌‌. విష్ణు ప్రసాద్‌‌ (సెల్‌‌ నం.9959090010), సిస్టం అనలిస్ట్‌‌ ఎన్‌‌. భరత్‌‌కుమార్‌‌ (9133119999), సీజీజీలో ప్రాజెక్ట్‌‌ మేనేజర్‌‌ పురుషోత్తం (9652681732), సాఫ్ట్‌‌వేర్‌‌ డెవలపర్‌‌ రాజేశ్‌‌ (9177452557)లను సంప్రదించాలని ఎస్‌‌ఈసీ అధికారులు సూచించారు.

గుర్తులే.. పేర్లుండవ్‌‌

బ్యాలెట్ల కోసం తెలుపు రంగు పేపర్‌‌ను వాడనున్నారు. కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌‌ తర్వాత పేపర్ల బ్యాలెట్‌‌ పేపర్ల ప్రింటింగ్‌‌ స్టార్ట్‌‌ చేస్తారు. జిల్లాల స్థాయిలో ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌లను ఇప్పటికే గుర్తించారు. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల వారీగా ప్రింటింగ్‌‌ మొదలుపెడతారు. పోటీలో ఉన్న క్యాండిడేట్ల పేర్లలోని మొదటి అక్షరాన్ని (తెలుగు అక్షరమాల) బట్టి క్యాండిడేట్లకు గుర్తులు కేటాయిస్తారు. బ్యాలెట్‌‌ పేపర్లో గుర్తులే ఉంటాయని, క్యాండిడేట్ల పేర్లు ఉండవని అధికారులు తెలిపారు. జిల్లా, మండల పరిషత్‌‌ ఎన్నికల కోసం వాడిన బ్యాలెట్‌‌ బాక్సులను జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెడీగా ఉంచారు.

2019 ఓటర్‌‌ జాబితాతోనే..

2020 ఓటర్ల జాబితా ఫైనల్‌‌ పబ్లికేషన్‌‌ ఫిబ్రవరి 7న జరుగుతుంది. కాబట్టి 2019 జనవరి ఒకటి నాటి ఓటర్ల జాబితానే మున్సిపోల్స్‌‌కు ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీని వల్ల 2020 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండే కొత్త ఓటర్లకు ఓటేసే అవకాశం ఉండదు.