తొలి కూతలో తొడగొట్టలేకపోయిన టైటాన్స్

తొలి కూతలో తొడగొట్టలేకపోయిన టైటాన్స్
  • ఓటమితో లీగ్‌ ను ఆరంభించిన తెలుగు టైటాన్స్​  
  • అంచనాలు అందుకోని సిద్దార్థ్‌‌ దేశాయ్‌
  • ఆల్‌ రౌండ్‌ షోతో యు ముంబా విక్టరీ

స్టార్‌‌ రైడర్‌‌ రాహుల్‌ చౌదరిని వదులుకొని, కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్‌ తొలి కూతలో తొడగొట్టలేక పోయింది. హోమ్‌‌గ్రౌండ్‌ లో మొదలైన ఏడో సీజన్‌ ను ఓటమితో ఆరంభించింది. లీగ్‌ లోనే ఖరీదైన ప్లేయర్‌‌ సిద్దార్థ్‌‌ దేశాయ్‌ అంచనాలు అందుకోలేకపోయిన వేళ.. ప్రణాళిక లేని ఆటతో పరాజయాన్ని మూట గట్టుకుంది. మరోవైపు పక్కా ప్లానింగ్‌ తో, అన్ని విభాగాల్లో సమయోచిత ఆటతో సత్తా చాటిన యు ముంబా ఘన విజయంతో బోణీ కొట్టింది.

హైదరాబాద్‌‌, వెలుగు: సొంత ప్రేక్షకుల మధ్య ప్రొ కబడ్డీ లీగ్‌‌ ఏడో సీజన్‌‌ను విజయంతో ఆరంభించాలని కోరుకున్న తెలుగు టైటాన్స్‌‌కు ఆశాభంగం. కొత్త ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపం.. ‘బాహుబలి’రైడర్‌‌ సిదార్థ్‌‌ దేశాయ్‌‌ వైఫల్యం జట్టును దెబ్బకొట్టాయి. గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌‌లో టైటాన్స్‌‌ 25–31తో యు ముంబా చేతిలో ఓడిపోయింది. మ్యాచ్‌‌లో ఇరు జట్లు చెరో పది టాకిల్‌‌ పాయింట్లు సాధించాయి. రైడింగ్‌‌లో టైటాన్స్‌‌ 15, ముంబా 16 పాయింట్లు రాబట్టింది. కానీ, టైటాన్స్‌‌ను రెండు సార్లు ఆలౌట్‌‌ చేసిన ముంబా నాలుగు ఆలౌట్‌‌ పాయింట్లు ఖాతాలో వేసుకొని విక్టరీ కొట్టింది. ఆ జట్టులో అభిషేక్‌‌ సింగ్‌‌ పది రైడ్‌‌ పాయింట్లతో టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచాడు. రోహిత్‌‌ బలియన్‌‌ నాలుగు పాయింట్లు రాబట్టగా.. డిఫెండర్‌‌ ఫజెల్‌‌ అత్రాచలి (4), ఆల్‌‌రౌండర్‌‌ సందీప్‌‌ నర్వాల్‌‌ (4) సత్తా చాటారు. టైటాన్స్‌‌ టీమ్‌‌లో రైడర్‌‌ రజ్‌‌నీశ్‌‌ (8) టాప్‌‌ స్కోరర్‌‌. సెకండాఫ్‌‌లో రాణించిన సిద్దార్థ్‌‌ దేశాల్‌‌ ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.

బాహుబలి ఫెయిల్‌‌.. టైటాన్స్‌‌ ఫ్లాప్​

వేలంలో టైటాన్స్‌‌ అత్యధిక రేటు పెట్టి కొనుగోలు చేసిన స్టార్‌‌ రైడర్‌‌ సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌పై ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో అందరి దృష్టి నిలిచింది. ‘బాహుబలి’సిద్దార్థ్‌‌ ప్రధానంగానే టైటాన్స్ ప్రచార కార్యక్రమాలు సాగాయి. కానీ, సిద్దార్థ్‌‌ అంచనాలను అందుకోలేకపోయాడు. కచ్చితంగా రాణించాలన్న ఒత్తిడి అతనిలో కనిపించింది. తన తొలి ఏడు రైడ్స్‌‌లో అతను ఒక్క పాయింట్‌‌ కూడా రాబట్టలేక ఐదు సార్లు ప్రత్యర్థికి దొరికిపోడంతో హోమ్‌‌టీమ్‌‌ డీలా పడింది. డిఫెన్స్‌‌లో కెప్టెన్‌‌ అబొజర్‌‌ కూల్‌‌గా ఆడినా మిగతా యువ ప్లేయర్లు అనవసర ట్యాకిల్స్‌‌కు పోయి పాయింట్లు ఇచ్చుకున్నారు. ముంబా మంచి ప్లాన్‌‌తో ఆడగా.. తొలి ఐదు నిమిషాల్లో టైటాన్స్‌‌ గట్టి పోటీనే ఇవ్వడంతో ఇరు జట్లు 3–3తో నిలిచాయి. గత సీజన్‌‌లో తమతో కలిసి ఆడిన సిద్దార్థ్‌‌ ఆటపై పూర్తి అవగాహన ఉన్న ముంబా అతడిని సమర్థంగా నిలువరించింది. ముఖ్యంగా లాస్ట్‌‌ సీజన్‌‌లో దేశాయ్‌‌కు ఫుల్‌‌ సపోర్ట్‌‌గా నిలిచిన ముంబా కెప్టెన్‌‌, స్టార్‌‌ డిఫెండర్‌‌ ఫజెల్‌‌ అత్రాచలి ఉడుం పట్టుతో తెలుగు ప్లేయర్‌‌ను అడ్డుకున్నాడు. మిగతా డిఫెండర్లు కూడా చురుగ్గా వ్యవహరిస్తూ టైటాన్స్‌‌ రైడర్లను వచ్చినవారిని వచ్చినట్టు టాకిల్‌‌ చేశారు. పదో నిమిషంలో రోహిత్‌‌ బలియన్‌‌ డబుల్‌‌ పాయింట్‌‌ రైడ్‌‌తో ముంబా 8–5తో లీడ్‌‌లోకి వెళ్లింది. 13వ నిమిషంలో హోమ్‌‌టీమ్‌‌ను తొలిసారి ఆలౌట్‌‌ చేసి 12–6తో ఆధిక్యాన్ని డబుల్‌‌ చేసుకుంది. ప్రత్యర్థి డిఫెన్స్‌‌ ఛేదించలేకపోయిన తెలుగు రైడర్లు ఒత్తిడిలో పడగా.. ముంబా 17–10తో ఫస్టాఫ్‌‌ను ముగించింది. బ్రేక్‌‌ తర్వాత 22వ నిమిషంలో డూ ఆర్‌‌ డై రైడ్‌‌కు వెళ్లిన రజ్‌‌నీశ్‌‌ పాయింట్‌‌ తెచ్చినా.. మిగతా ప్లేయర్ల నుంచి సహకారం కరువైంది. మరోవైపు ముంబా రైడర్‌‌ అభిషేక్‌‌ సింగ్‌‌ వరుస పాయింట్లతో రెచ్చిపోయాడు. తొలి 30 నిమిషాల్లో టైటాన్స్‌‌ అతడిని టాకిల్‌‌ చేయలేకపోయింది. 26 నిమిషంలో మరోసారి ఆలౌటైన తెలుగు జట్టు 13–24తో మరింత డీలా పడింది. అప్పటికి చాలా సమయం పాటు బయటే ఉన్న సిద్దార్థ్‌‌ 30వ నిమిషంలో కోర్టులోకి వచ్చినా సందీప్‌‌ నర్వాల్‌‌ అద్భుత టాకిల్‌‌తో మళ్లీ బెంచ్‌‌కు పంపించాడు. ఎట్టకేలకు 33వ నిమిషంలో తన ఎనిమిదో రైడ్‌‌లో సిద్దార్థ్‌‌ బోణీ కొట్టగలిగాడు.  వెంటనే మరో పాయింట్‌‌ రాబట్టిన దేశాయ్‌‌ను అత్రాచలి టాకిల్‌‌ చేయడంతో 35 నిమిషాలకు ముంబా 26–19తో గెలుపు ముంగిట నిలిచింది. ఆపై అభిషేక్‌‌ మరో డబుల్‌‌ పాయింట్‌‌ రైడ్‌‌తో సూపర్‌‌ టెన్‌‌ సాధించడంతో లీడ్‌‌ 30–19కి పెరిగింది. 38వ నిమిషంలో తొలిసారి సూపర్‌‌ టాకిల్‌‌ చేసిన టైటాన్స్‌‌ పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. సిద్దార్థ్‌‌ కూడా చివర్లో మూడు పాయింట్లు తెచ్చాడు. కానీ, ముంబా లీడ్‌‌ను కాపాడుకొని ఈజీగా గెలిచింది.

పట్నాపై బుల్స్‌ ఉత్కంఠ విజయం

తొలి మ్యాచ్‌ వన్‌ సైడ్‌ అయినా, డిఫెండింగ్‌చాంప్‌ బెంగళూరు బుల్స్‌ , మూడు సార్లువిజేత పట్నా పైరేట్స్‌ మధ్య పోరు ఫ్యాన్స్‌ నుఫిదా చేసింది. చివరి వరకు ఉత్కంఠగాసాగిన ఈ మ్యాచ్‌ లో బుల్స్‌ 34–32తో పట్నాపైగెలిచింది. 16వ నిమిషంలో బుల్స్‌ ను ఆలౌట్‌‌‌‌ చేసిన పట్నా ఫస్టా ఫ్‌ లో 17–13తో నాలుగుపాయింట్ల ఆధిక్యం సాధించింది. కానీ,సెకండాఫ్‌ లో బుల్స్‌ అద్భుతంగాపుంజుకుంది. పట్నా స్టా ర్‌ పర్‌ దీప్‌ నర్వాల్‌‌‌‌ వరుసగా పాయింట్లు రాబట్టినా.. సమష్టిగాఆడిన బెంగళూరు చివర్లో ఒత్తిడిని జయించివిజయం సాధించింది. బుల్స్‌ తరఫున పవన్‌(9), అమిత్‌ (4) రాణించా రు. పర్‌ దీప్‌ (10),ఇస్మాయిల్‌‌‌‌ (9) పోరాటం పట్నానుగట్టెక్కించలేదు.