హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ ​యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశాయి.   వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కుల వివక్ష కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదంటూ సైబరాబాద్ ​పోలీసులు హైకోర్టుకు తుది నివేదిక అందజేశారు. కుల సర్టిఫికెట్ విషయంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు శుక్రవారం విచారణను ముగించింది. అనంత రం సాయంత్రం హెచ్ సీయూలో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.  

 వీసీ అప్పారావు పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చగా..  

రోహిత్​ వేముల 2016 జనవరి 17న తన హాస్టల్​గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీసీ అప్పారావు కుల వివక్ష చూపడంతోనే రోహిత్​చనిపోయాడని అప్పట్లో విద్యార్థులు పెద్దఎత్తున  ఆందోళనకు దిగారు. విద్యార్థుల నిరసనలతో  వీసీ అప్పారావు పేరును ఎఫ్ఐఆర్​లో చేర్చుతూ  గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వీసీ హైకోర్టును ఆశ్రయించారు. 

 పోరాటం ఆగదు: హెచ్​సీయూ విద్యార్థులు 

రోహిత్​ కేసును హైకోర్టు ముగించిన నేపథ్యంలో హెచ్​సీయూలో విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డాయి. వర్సిటీలోని వెలివాడ నుంచి మెయిన్​గేట్​ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశాయి.  బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వీసీ అప్పారావు, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, రాంచందర్​రావులను కాపాడేందుకే రోహిత్​ కేసును కొట్టివేశారని, ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగానే జరిగిందని ఆరోపించారు.   రోహిత్​ సూసైడ్​కు కుల వివక్షే కారణమని 16 మంది సాక్షులు తమ సాక్ష్యం చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు.  రోహిత్ కు న్యాయం జరిగేదాకా.. దోషులకు శిక్ష పడే వరకు కొట్లాడతామని విద్యార్థులు స్పష్టంచేశారు. వర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసు రీ ఇన్వెస్టిగేషన్ కు హైకోర్టును అభ్యర్థిస్తాం :  డీజీపీ 

రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో శుక్రవారం మీడియాలో వచ్చిన న్యూస్ పై డీజీపీ రవి గుప్తా స్పందించారు. సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ క్రైమ్ నం.20/2016కు సంబంధించిన కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారని తెలిపారు. తుది నివేదికను గతేడాది నవంబర్ కు ముందు చేసిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారని పేర్కొన్నారు.  

దానినే  అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్  హై కోర్టులో దాఖలు చేశారని వెల్లడించారు. విచారణ జరిగిన తీరుపై  మృతుడు రోహిత్ తల్లితో పాటు హెచ్ సీయూ విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసును మళ్లీ ఎంక్వైరీ  చేయాలని నిర్ణయించామని తెలిపారు.  కేసుపై తదుపరి దర్యాప్తును అనుమతించాలని కోర్టు మేజిస్ట్రేట్‌ను అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేయబడుతుందని ఆయన వివరించారు.