హైదరాబాద్: ఏ ఉద్యమానికీ ఒక్క కథానాయకుడు ఉండడని, ఉద్యమంలో పాల్గొన్న వారే అసలు కథానాయకులని ప్రభుత్వ సల హాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు అన్నారు. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్య మకారులకు గతంలో ఇచ్చిన హామీలను ప్రభు త్వం అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఉద్య మకారుల సమస్యలపై స్పష్టమైన కార్యచరణ ప్రకటించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరా వు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది తమ జీవితాలను అంకితం చేశారని, కేవలం ఎఫ్ఐఆర్లు ఒక్కటే కొలమానం కాదని పేర్కొన్నారు. అర్హులైన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తాను కూడా ఉద్యమకారుల్లో ఒకడి నేనని, వారికి అండగా నిలబడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఉద్యమకారుల హామీల అమలుపై సబ్ కమిటీ ఏర్పాటు కానుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యపడలేదని, అనేక మంది త్యాగాల ఫలితమే రాష్ట్ర సాధన అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గౌరవించే చర్యలు తీసుకున్నామని చెప్పారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించడం కూడా అందులో భాగమని తెలిపారు. ఉద్యమకారులకు ఏసమస్య ఉన్నా తనతో పంచుకోవాలని కేశవరావు సూచించారు.
