అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదా జీరో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ పై బ్యాంకులు బాదేస్తున్న చార్జీల గురించి ప్రభుత్వం పార్లమెంట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది.
అకౌంట్లో డబ్బులు తక్కువగా ఉన్నాయని బ్యాంకులు మన అకౌంట్ల నుంచి ఫైన్ల రూపంలో కోట్లు గుంజుతున్నాయి. కేవలం ఒక్క 2026 ఆర్థిక సంవత్సరంలోనే (FY26) దేశవ్యాప్తంగా కస్టమర్ల నుంచి బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఛార్జీల రూపంలో ఏకంగా రూ. 7,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు.
ప్రైవేట్‌దే పై చెయ్యి
ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన డేటా ప్రకారం.. ప్రైవేట్ రంగ బ్యాంకులే కస్టమర్ల నుండి ఈ ఛార్జీల ద్వారా రూ. 4,948.71 కోట్లు వసూలు చేయగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు) రూ. 2,137.92 కోట్లు బాదేసాయి.
అందులోనూ ప్రైవేట్ బ్యాంకుల జోరు మామూలుగా లేదు. హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ ఏకంగా రూ. 1,798.14 కోట్లతో నంబర్ వన్ స్థానంలో నిలవగా.. యాక్సిస్ (Axis) బ్యాంక్ రూ. 1,081.33 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండే బ్యాంకులు కలిసి మొత్తం ప్రైవేట్ బ్యాంకులు వసూలు చేసిన దానిలో ఏకంగా 58% (రూ. 2,879.47 కోట్లు) కాజేయడం విశేషం.
అయితే, సామాన్యులకు రిలీఫ్ ఇచ్చే విషయం ఏంటంటే.. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) అకౌంట్లతో పాటు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA) వాళ్లకు ఈ మినిమం బ్యాలెన్స్ జరిమానాల నుంచి మినహాయింపు ఉంది.
ప్రభుత్వ బ్యాంకుల పరిస్థితి
మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ప్రస్తుతం మన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉందని చెప్పారు. రికార్డు స్థాయి లాభాలు వస్తున్నాయని, మొండి బకాయిలు (NPAs) దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయని తెలిపారు.
వ్యాపారులకు ఈసీఎల్‌జీఎస్ (ECLGS 5.0) భరోసా
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాల వల్ల వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం 2026 మే నెలలో ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) 5.0’ ను తెచ్చింది.
ఈ పథకం కింద నష్టపోతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs), అలాగే ఎయిర్‌లైన్స్ రంగానికి ఊతమిచ్చేలా ఎయిర్‌లైన్స్‌కు కేటాయించిన రూ. 5,000 కోట్లతో సహా.. మొత్తంగా రూ. 2.55 లక్షల కోట్ల వరకు రుణాలు అందేలా ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తోందని మంత్రి వెల్లడించారు.
