- ఎంఐఎంకు రేవంత్ సర్కార్ లొంగిపోయింది: రామచందర్ రావు
- రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఓట్లు
- అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు
హైదరాబాద్/ హుజూర్నగర్, వెలుగు: ఎంఐఎంకు లొంగిపోయిన రేవంత్ సర్కారు.. అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా ఓట్లను కాపాడుకోవడానికి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. మంగళవారం మాజీ ఐఆర్‌ఎస్ అధికారి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో, అనంతరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల ఆత్మీయ సమ్మేళనంలో రామచందర్ రావు మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రేవంత్ ప్రభుత్వం అక్రమార్కులకు అడ్డాగా మార్చిందని మండిపడ్డారు. ఏ ఆధారాలు లేని వాళ్లకు కూడా హడావుడిగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఇచ్చి ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, అనర్హుల పేర్లు చేరకుండా చూడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్చెల్లించకపోవడం వల్ల 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
జాబ్ క్యాలెండర్ పక్కనపడేశారని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు వీధుల్లో దొరుకుతున్నాయని విమర్శించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని రాంచందర్రావు డిమాండ్చేశారు. హుజూర్నగర్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శాంతి కుమార్, ఆరోగ్య భారతి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ సీరంగాచార్యులు, మాజీ ఐఆర్ఎస్ చందా సుధాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చెల్లా శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు
