మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ.. ఇక ప్రభుత్వ స్కూల్స్కు క్యూ కడతారేమో !

మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ.. ఇక ప్రభుత్వ స్కూల్స్కు క్యూ కడతారేమో !

చెన్నై: తమిళనాడులో విజయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. వారంలో ఒకరోజు చికెన్ బిర్యానీని మెనూలో చేర్చాలని విజయ్ సర్కార్ భావిస్తోంది. పాఠశాలల విద్యా శాఖ మంత్రి ఎ.రాజ్ మోహన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. సీఎం విజయ్ ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లిందని.. ఆయన పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.

ఆగస్టు 5న రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సంప్రదింపుల సమావేశంలో 80కి పైగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అనేక డిమాండ్లలో ఈ సూచన కూడా ఒకటి కావడం గమనార్హం.

మధ్యాహ్న భోజన పథకంలో వాడే బియ్యం నాణ్యతను మెరుగుపరచాలని, వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని విద్యార్థులకు వడ్డించాలని తాము ప్రభుత్వాన్ని కోరామని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలును మధ్యాహ్న భోజన కార్మికులకు అప్పగించి, వారి సేవలను క్రమబద్ధీకరించాలని కూడా ప్రభుత్వాన్ని కోరామని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి వెల్లడించారు. బిర్యానీ ప్రతిపాదనతో పాటు, ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని, మధ్యాహ్న భోజన పథకాన్ని 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు కూడా వర్తించేలా చేయాలని విద్యా శాఖను ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.

ప్రస్తుతం.. తమిళనాడులో ముఖ్యమంత్రి అల్పాహార పథకం కింద ఒకటవ నుంచి 8వ తరగతి వరకు (సెప్టెంబర్‌లో పొడిగింపుతో) విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకంలో సుమారు 32 లక్షల మంది పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం 10వ తరగతి వరకు అమలులో ఉంది.  సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజనం అందుతుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని 11, 12 తరగతులకు కూడా విస్తరిస్తే.. మరో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.