బాగల్కోట్: భార్యపై అనుమానంతో ఆమె ప్రాణం తీశాడు. ఆమె కన్న వాళ్లకు ఆమె చావును చూపించాలనే శాడిజం అతనిలో నిద్ర లేచింది. భార్యకు ఉరేసి ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేశాడు. చనిపోయే చివరి క్షణాల్లో ఆమె అనుభవించే వేదనను, బాధను చూడాలని భార్య తల్లిదండ్రులను బలవంతం చేశాడు. కన్న కూతురు చావును కళ్ల ముందే చూపించి కడుపు కోత మిగిల్చిన ఈ శాడిస్ట్ భర్త ఉదంతం కర్ణాటకలోని బాగల్ కోట్లో సోమవారం రాత్రి జరిగింది. నిందితుడు పేరు ప్రవీణ్. అతని భార్య పేరు భాగ్యశ్రీ. భార్యకు వివాహేతర సంబంధం ఉందని కొంత కాలంగా ప్రవీణ్ అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం పెను భూతమైంది. భార్యను అనుమానిస్తూ నిత్యం వేధించేవాడు.
ఇటీవల భర్త వేధింపులు తట్టుకోలేక భాగ్యశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సహజమని, భర్తతో మాట్లాడి రాజీకి రావాలని.. కాపురం చేసుకోవాలని కూతురికి నచ్చజెప్పి పంపారు. భాగ్యశ్రీ సోమవారం ఉదయమే భర్త దగ్గరకు వెళ్లింది. భర్త అర్థం చేసుకుంటాడనే ఆశతో మెట్టినింటికి వచ్చిన భాగ్యశ్రీకి నిరాశనే ఎదురైంది. ప్రవీణ్ అనుమానించడమే కాకుండా భాగ్యశ్రీపై కర్రతో దాడి చేశాడు. ఆ తర్వాత వారి పడకగదిలో ఆకుపచ్చ దుపట్టాతో ఆమెను ఉరి తీశాడు.
భాగ్యశ్రీని ఉరి తీసిన సమయంలో.. ఆమె కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా వీడియో తీసి, ఆ క్లిప్‌ను బంధువులు, స్నేహితులకు పంపాడు. ఆమె ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, అతను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూడాలని భాగ్యశ్రీ తల్లిదండ్రులను బలవంతం చేశాడు. కలిసి ఉంటామని ప్రవీణ్ చెప్పాకే భాగ్యశ్రీ తిరిగి వెళ్లిందని.. ఇంత ఘాతుకానికి ఒడిగడతాడని అనుకోలేదని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
