తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కరూర్ దగ్గర ప్రైవేట్ కాలేజీ బస్సును గూడ్సు రైలు ఢీకొట్టింది. శనివారం (మార్చి 14) జరిగిన ఈ ప్రమాదంలో 23 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమిళ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
కరూర్ లోని వెల్లియనై లో ఈ యాక్సిడెంట్ జరిగింది. బస్సు రైల్వే ట్రాక్ ను క్రాస్ చేసేందుకు ప్రయత్నించి పట్టాలపైన ఇరుక్కుపోయింది. ట్రైన్ దగ్గరకు వస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితిల్లో డ్రైవర్ ఉండిపోయాడు. అంతలోనే రైలు బస్సును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.
ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి గులకరాళ్లు తీసుకెళ్తున్న ట్రైన్ ఢీకొట్టడంతో బస్సు డ్యామేజ్ అయ్యింది. బస్సులో ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్రైన్ యాక్సిడెంట్ గురించి తెలిసి అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కరూర్ ఎష్పీ జోష్ థంగయ్య స్పాట్ కు వెళ్లి ప్రమాదకారణాలను తెలుసుకున్నారు. అదే విధంగా కరూర్ ఎంపీ జోతిమణి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మింది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం.
