వెండి ధరల్లో ఎదుగూ బొదుగూ లేదు.. ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్లు.. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో రోజుకు 10 వేలు.. 15 వేలు పెరిగిన వెండి ధర.. ఆ తర్వాత తీవ్ర హెచ్చుతగ్గులతో కొనసాగింది. యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వెండి ధరల్లో మార్పు లేకుండా పడి ఉంది. అసలు వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా.. ఇప్పుడు కొనచ్చా లేదా అనే సందేహాలతో వినియోగదారులు వర్రీ అవుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు వెండి ధరల దూకుడుకు తాత్కాలికంగా బ్రేకులు వేశాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా వెండికి డిమాండ్ పెరగాలి. కానీ ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడటం వల్ల పరిస్థితి తలకిందులైంది. గడచిన 15 రోజులుగా వెండి రేట్లు దాదాపుగా పెద్ద తేడా లేకుండా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు డాలర్లలో నిర్ణయించబడతాయి కాబట్టి.. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కొనుగోలుదారులకు ఇది భారంగా మారుతోంది. దీనికి తోడు యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు వెండి లాంటి వడ్డీ లేని ఆస్తులపై ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గిపోతోంది.
అయితే యుద్ధం ముగిసిన తర్వాత వెండి ధరలు ఎలా స్పందిస్తాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకసారి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గగానే.. మార్కెట్‌లో మళ్లీ రిస్క్ తీసుకునే ధోరణి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధ సమయంలో కేవలం సురక్షిత ఆస్తిగా పరిగణించబడిన వెండి, యుద్ధం తర్వాత తన పారిశ్రామిక డిమాండ్ కొనసాగించే అవకాశం ఉంది. వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, చిప్ తయారీ వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తూ పారిశ్రామిక లోహంగా ప్రాముఖ్యతను పెంచుకుంటోంది. యుద్ధం ముగిశాక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటే.. పారిశ్రామిక డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు యుద్ధ కాలంలో వెండి ధరలు తగ్గినప్పుడు తెలివైన పెట్టుబడిదారులు 'డిప్'లో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. యుద్ధం తర్వాత డాలర్ విలువ స్థిరీకరించబడితే, ఇన్వెస్టర్లు మళ్లీ బులియన్ మార్కెట్ వైపు వస్తారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో వెండి వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. షార్ట్ టర్మ్ లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో వెండి మెరిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు పెరగడానికి పారిశ్రామిక పునరుద్ధరణ, తగ్గిన వడ్డీ రేట్లు ప్రధాన డ్రైవింగ్ ఫోర్సులుగా మారతాయని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
