బల్దియా బడ్జెట్ పై అధికారులు సైలెంట్

బల్దియా బడ్జెట్ పై అధికారులు సైలెంట్
  • స్టాండింగ్​ కమిటీ ముందుకురాని ప్రపోజల్స్
  • 3 నెలల గడిచినా తయారీపై ఆఫీసర్లు సైలెంట్
  • ఫిబ్రవరి 20 వస్తున్నా ఫోకస్ ​చేయని కౌన్సిల్​
  • ఈ ఏడాది కావాలనే నిర్లక్ష్యమంటూ విమర్శలు

హైదరాబాద్​, వెలుగు: బల్దియా బడ్జెట్ ​లేట్ ​అవుతోంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.  ఏ పనిలోనైనా యాక్ట్​ని ఫాలో అయ్యే బల్దియా బడ్జెట్ పై మాత్రం సైలెంట్​గా ఉంటోంది. కొత్త ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్ 3 నెలల ముందు నుంచే ఫోకస్​చేసి ప్రాసెస్​ప్రారంభించి మార్చి చివరి నాటికి రెడీ చేసుకోవాలి.  వచ్చే ఏడాది బడ్జెట్ పైన ప్రస్తుతం బల్దియా హడావుడి కనిపించడంలేదు. జీహెచ్​ఎంసీ యాక్ట్  ప్రకారం ప్రతి ఏటా ఫిబ్రవరి 20 నాటికి బడ్జెట్​కు పాలకమండలి ఆమోదం తెలపాలి. ఇందుకు నవంబర్ లోనే బడ్జెట్ ప్రక్రియను ప్రారంభించి అదే నెలలో స్టాండింగ్ కమిటీ ముందుకు తేవాలి. డిసెంబర్​10 లోపు బడ్జెట్ కు ఏవైనా మార్పులు చేర్పులు చేసిన అనంతరం ఓకే చెప్పాలి. అది డిసెంబర్ 15 నాటికి కౌన్సిల్ ముందుకు రావాల్సి ఉంటుంది. దానిపై చర్చించిన తర్వాత జనవరి 10 లోపు రివ్యూ చేసి ఆమోదానికి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది.  ఇప్పటికే 3 నెలలు గడిచినా బడ్జెట్​ప్రతిపాదనలు నేటికీ స్టాండింగ్ కమిటీ ముందుకే రాలేదు. 

 బడ్జెట్ ​రూపొందించినట్టు ఆఫీసర్లు చెబుతుండగా..

కోటికిపైగా జనాభాకు కావాల్సిన సేవలకు రూపొందించాల్సిన బడ్జెట్ పై కమిషనర్, మేయర్ ఫోకస్ ​చేయక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతేడాది బల్దియా ఎన్నికలు, మేయర్ ఎన్నిక కారణంగా బడ్జెట్ లేట్​ అయింది. ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకున్నా కూడా బడ్జెట్ ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం లేదనేది చర్చనీయంశంగా మారింది. ఎందుకు ఆలస్యం అవుతుందన్న దానిపై క్లారిటీ ఇవ్వడంలేదు. ఇప్పటికే బడ్జెట్ రూపొందించినట్లు ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ స్టాండింగ్​ కమిటీ ముందుకు ఎందుకు రావడంలేదనే అనుమానం వస్తుంది. 

కార్పొరేటర్లకు నిధులు డౌటే..! 

డివిజన్ల అభివృద్ధికి కార్పొరేటర్లకు ఫండ్స్​కేటాయించాలని ప్రతి కౌన్సిల్​మీటింగ్​లోనూ డిమాండ్ చేస్తున్నారు. ఈసారి బడ్జెట్​కోసం కార్పొరేటర్లు వెయిట్​చేస్తున్నారు. అయితే ఫండ్స్​కేటాయిస్తారనేది మాత్రం డౌట్​గానే  ఉంది.  ఇప్పటికే కార్పొరేటర్లు చాలా సీరియస్ గా ఉన్నారు. నిధులు కేటాయించకపోతే ఆందోళనలు కొనసాగిస్తామని కూడా వార్నింగ్​లు ఇస్తున్నారు. కార్పొరేటర్ల ఫండ్స్​పై బల్దియా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

 గతేడాది కంటే తక్కువేనా..?

 గతేడాదికంటే ఈసారి బడ్జెట్ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి  గ్రాంట్లు రాకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. 2021–22 ఆర్థిక ఏడాదికి రూ.5600 కోట్ల బడ్జెట్​పెట్టారు. ఈఏడాదికి (2022–23 )కి కాస్త అటు ఇటుగా ఉండే అవకాశాలు లేకపోలేదు.  అయితే ప్రతిసారి ఆమోదించిన బడ్జెట్ లోనూ 60 నుంచి 70 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నారు. 

కార్పొరేటర్లకు​ ఫండ్స్​ కేటాయించాలె

డివిజన్లు డెవలప్ కావాలంటే కార్పొరేటర్లకు ఫండ్స్​ కేటాయించాలె. స్థానికంగా ఉండే ప్రాబ్లమ్స్​ ఎక్కువగా కార్పొరేటర్లకే తెలుస్తాయి. ఈసారి బడ్జెట్​లో డివిజన్​కు  రూ.కోటి  ఇవ్వాలె. నా డివిజన్ నుంచి రూ,కోట్లు బల్దియాకు ట్యాక్స్​లుగా వెళ్తున్నాయి. అంగన్ వాడీ స్కూల్స్​కి డోర్లు చేయిద్దామంటే కూడా శాంక్షన్​ లెటర్ పెట్టాల్సి వస్తోంది.  
 –ఆకుల శ్రీవాణి,
 మూసాపేట కార్పొరేటర్