బెంగళూరుపై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

బెంగళూరుపై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

బెంగళూరుకు మూడో ఓటమి

మెరిసిన రాహుల్‌‌, మయాంక్‌‌

ఎప్పుడెప్పుడు వస్తాడా.. అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌‌ ఒక్క మ్యాచ్‌‌తోనే పండుగ చేసుకున్నారు..! ఎందుకొచ్చాడురా బాబు అనుకున్న బౌలర్లు తలలు పట్టుకున్నారు..! మొత్తానికి లేట్‌‌గా దిగినా.. లేటెస్ట్‌‌గా ఆడిన యూనివర్స్‌‌ బాస్‌‌ క్రిస్‌‌ గేల్‌‌ (45 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 5 సిక్సర్లతో 53) కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ రాత కూడా మార్చాడు..! వరుస పరాజయాలతో బిక్క చచ్చిపోయిన కింగ్స్‌‌కు ‘ప్లే ఆఫ్‌‌’ జీవం పోశాడు..! కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (49 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 5 సిక్సర్లతో 61 నాటౌట్‌‌), మయాంక్‌‌ అగర్వాల్‌‌ (25 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) కూడా రాణించడంతో పంజాబ్​ రెండో విక్టరీ అందుకుంది..! మరోవైపు కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (39 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 48) పోరాటంతో  బెంగళూరు మంచి టార్గెట్‌‌ ఇచ్చినా.. బౌలర్లు దానిని కాపాడుకోలేకపోయారు..! ఫలితంగా మూడో ఓటమిని మూటగట్టుకున్నారు..!!

షార్జా: పంజాబ్​ గెలవాలంటే లాస్ట్‌‌ ఓవర్‌‌లో 2 రన్స్‌‌ కావాలి..! గేల్‌‌, రాహుల్‌‌ క్రీజులో ఉన్నారు..! కానీ ఎవరూ ఊహించని విధంగా చహల్‌‌ చేతికి బంతి ఇచ్చిన కోహ్లీ అతిపెద్ద సాహసం చేశాడు..! ఫస్ట్‌‌ రెండు డాట్‌‌ బాల్స్‌‌ వేసిన చహల్‌‌.. మూడో బాల్‌‌కు ఒక్క రన్‌‌ ఇచ్చాడు..! ఇక మూడు బాల్స్‌‌లో ఒక రన్‌‌ కావాల్సిన టైమ్‌‌లో మళ్లీ డాట్‌‌ బాల్‌‌..! దీంతో మ్యాచ్‌‌లో ఉత్కంఠ పెరిగిపోయింది..! ఐదో బాల్‌‌ను కవర్స్‌‌లోకి పంపిన రాహుల్‌‌ రన్‌‌ కోసం పరుగెత్తాడు. కానీ లేట్‌‌గా స్పందించిన గేల్‌‌ రనౌట్‌‌కావడంతో ఉత్కంఠ రెట్టింపైంది..! విక్టరీ ఈక్వేషన్‌‌ ఒక బాల్‌‌.. ఒక రన్‌‌ కావడంతో పంజాబ్‌‌కు మరో ఓటమి తప్పదేమో అనుకుంటున్న తరుణంలో పూరన్‌‌ (6 నాటౌట్‌‌) భారీ సిక్సర్‌‌తో విజయ లాంఛనం పూర్తి చేసి టీమ్‌‌ను గట్టెక్కించాడు. ఫలితంగా గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ 8 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్‌‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 రన్స్‌‌ చేసింది. కోహ్లీకి తోడుగా ఆఖర్లో క్రిస్‌‌ మోరిస్‌‌ (8 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 25 నాటౌట్‌‌), ఉడాన (5 బాల్స్‌‌లో 1 సిక్స్‌‌తో 10 నాటౌట్‌‌) రెచ్చిపోయారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌‌కు కేవలం 13 బాల్స్‌‌లోనే 35 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ నెలకొల్పారు. తర్వాత పంజాబ్‌‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 177 రన్స్‌‌ చేసి గెలిచింది. రాహుల్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది.

కోహ్లీ ఓకే..

స్లో వికెట్‌‌పై బెంగళూరు ఇన్నింగ్స్‌‌ పడుతూ లేస్తూ సాగింది. ఓపెనర్లు ఫించ్‌‌ (20), పడిక్కల్‌‌ (18) ఓ మాదిరి ఆరంభాన్నిచ్చినా.. మధ్యలో విరాట్‌‌ వెన్నెముకగా నిలిచాడు. ఇన్నింగ్స్‌‌ ఆరో బాల్‌‌ను ఫించ్‌‌ సిక్సర్‌‌గా మల్చితే.. నాలుగో ఓవర్‌‌లో పడిక్కల్‌‌ అద్భుతమైన ఫుల్‌‌షాట్‌‌తో స్టాండ్స్‌‌లో పంపాడు. కానీ ఐదో ఓవర్‌‌ ఫస్ట్‌‌బాల్‌‌ను షాట్‌‌గా మలిచే క్రమంలో షార్ట్‌‌ ఎక్స్‌‌ట్రా కవర్‌‌లో పూరన్‌‌ చేతికి చిక్కాడు. దీంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 38 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. వచ్చి రావడంతో కోహ్లీ  రెండు ఫోర్లు కొట్టి ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. పంజాబ్‌‌ కెప్టెన్‌‌ రాహుల్‌‌.. ఎక్కువగా పేస్‌‌–స్పిన్‌‌ కాంబినేషన్‌‌ను యూజ్‌‌ చేయడంతో పవర్‌‌ప్లేలో బెంగళూరు 57/1 స్కోరు సాధించింది. అప్పటివరకు జోరు చూపెట్టిన ఫించ్‌‌..  అశ్విన్‌‌ (2/23) వేసిన ఏడో ఓవర్‌‌ రెండో బాల్‌‌ను బ్యాక్‌‌ ఫుట్‌‌పై ఆడే క్రమంలో క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. ఈ టైమ్​లో  కోహ్లీతో జతకలిసిన సుందర్‌‌ (13) వికెట్‌‌ కాపాడుకునేందుకు ప్రయత్నించడంతో తర్వాతి మూడు ఓవర్లలో 6, 6, 8 రన్సే వచ్చాయి. ఫలితంగా పది ఓవర్లలో ఆర్‌‌సీబీ 83/2 స్కోరుతో నిలిచింది. కానీ 11వ ఓవర్‌‌లో బెంగళూరుకు సుందర్‌‌ రూపంలో మరో దెబ్బ పడింది. అశ్విన్‌‌ బాల్‌‌ను లాంగాన్‌‌లోకి లేపగా జోర్డాన్‌‌ అందుకున్నాడు. ఈ టైమ్‌‌లో వచ్చిన శివమ్‌‌ దూబే (23) సింగిల్స్‌‌కు పరిమితమయ్యాడు. స్పిన్నర్లు బాల్‌‌ను బాగా టర్న్‌‌ చేయడంతో విరాట్‌‌ కూడా అదే తరహాలో వెళ్లడంతో తర్వాతి మూడు ఓవర్లలో 15 రన్స్‌‌ మాత్రమే వచ్చినా స్కోరు 100 దాటింది.  అయితే రవి వేసిన 15వ ఓవర్‌‌లో రెండు వరుస సిక్సర్లతో 19 రన్స్‌‌ రాబట్టిన దూబే.. తర్వాతి ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌ను భారీ షాట్‌‌ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. నాలుగో వికెట్‌‌కు 41 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 18వ ఓవర్‌‌లో షమీ (2/45) డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. 127/4 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌‌ (2), కోహ్లీని మూడు బాల్స్‌‌ తేడాలో ఔట్‌‌ చేశాడు. దీంతో ఆర్‌‌సీబీ స్కోరు 150 కూడా దాటుతుందో లేదో అనుమానాల మధ్య మోరిస్‌‌, ఉడాన రెచ్చిపోయారు. లాస్ట్‌‌ రెండు ఓవర్లలో ఈ ఇద్దరు 6, 4, 6, 6, 6తో 34 రన్స్‌‌ దంచారు.

ఓపెనింగ్‌‌ అదుర్స్‌‌..

భారీ టార్గెట్‌‌ కాకపోయినా పంజాబ్‌‌ ఓపెనర్లు రాహుల్‌‌, మయాంక్‌‌ దూకుడుగానే మొదలుపెట్టారు. మూడో ఓవర్‌‌లో సిక్సర్‌‌తో కెప్టెన్‌‌ టచ్‌‌లోకి రాగా, నాలుగో ఓవర్‌‌లో మయాంక్​ 6, 4, 4తో 15 రన్స్‌‌ పిండుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌లో రాహుల్‌‌ మరో సిక్సర్‌‌, మయాంక్‌‌ ఫోర్‌‌ కొట్టడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. ఆరో ఓవర్‌‌లో లాంగాన్‌‌లో లాఫ్టెడ్‌‌ సిక్సర్‌‌ కొట్టిన మయాంక్‌‌ టీమ్‌‌ స్కోరును 56కు చేర్చాడు. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన హైదరాబాద్‌‌ కుర్రాడు సిరాజ్‌‌ 9 రన్సే ఇచ్చినా.. 8వ ఓవర్‌‌లో చహల్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. ఐదో బాల్‌‌కు సిక్సర్‌‌ సమర్పించుకున్నా.. లాస్ట్‌‌ బాల్‌‌కు మయాంక్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేయడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 78 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది.  గేల్‌‌ రాకతో ఫ్యాన్స్‌‌ భారీ షాట్స్‌‌ను ఆశించారు. కానీ ఆర్‌‌సీబీ బౌలర్లు కట్టడి చేయడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో పంజాబ్‌‌ 84/1 స్కోరే చేసింది. దీంతో రాహుల్‌‌పై ఒత్తిడి పెరిగింది. దీనిని అధిగమించేందుకు సిరాజ్‌‌ వేసిన 12వ ఓవర్‌‌లో లాస్ట్‌‌ రెండు బాల్స్‌‌ను స్టేడియం బయటకు కొట్టి కసి తీర్చుకున్నాడు. ఆ వెంటనే సుందర్‌‌ బౌలింగ్‌‌లో గేల్‌‌ రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. 14వ ఓవర్‌‌లో మోరిస్‌‌.. గేల్‌‌ను ఔట్‌‌ చేసినా రివ్యూలో గట్టెక్కాడు. ఈ ఓవర్‌‌లో 4, తర్వాతి ఓవర్‌‌లో 3 రన్సే రావడంతో 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌‌ 126/1 స్కోరు చేసింది. ఇక గెలవాలంటే 30 బాల్స్‌‌లో 46 రన్స్‌‌ కావాల్సిన దశలో గేల్‌‌ 4, 6, రాహుల్‌‌ సిక్సర్‌‌ బాదడంతో 20 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో గేల్‌‌ 6, 6తో 15 రన్స్‌‌ రాబట్టడంతో విక్టరీ ఈక్వేషన్‌‌ 18 బాల్స్‌‌ 11 రన్స్‌‌గా మారింది. 18వ ఓవర్‌‌లో 4 రన్స్, తర్వాతి ఓవర్‌‌లో 5 రన్స్‌‌ రావడంతో లాస్ట్‌‌ ఓవర్‌‌లో 2 రన్స్‌‌ అవసరమయ్యాయి.

బెంగళూరు: ఫించ్‌‌ (బి) అశ్విన్‌‌ 20, పడిక్కల్‌‌ (సి) పూరన్‌‌ (బి) అర్షదీప్‌‌ సింగ్‌‌ 18, కోహ్లీ (సి) రాహుల్‌‌ (బి) షమీ 48, సుందర్‌‌ (సి) జోర్డాన్‌‌ (బి) అశ్విన్‌‌ 13, దూబే (సి) రాహుల్‌‌ (బి) జోర్డాన్‌‌ 23, డివిలియర్స్‌‌ (సి) హుడా (బి) షమీ 2, మోరిస్‌‌ (నాటౌట్‌‌) 25, ఉడాన (నాటౌట్‌‌) 10, ఎక్స్‌‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 171/6. వికెట్ల పతనం: 1–38, 2–62, 3–86, 4–127, 5–134, 6–136. బౌలింగ్‌‌: మ్యాక్స్‌‌వెల్‌‌ 4–0–28–0, షమీ 4–0–45–2, అర్షదీప్‌‌ సింగ్‌‌2–0–20–1, రవి బిష్ణోయ్‌‌ 3–0–29–0, అశ్విన్‌‌ 4–0–23–2, జోర్డాన్‌‌ 3–0–20–1.

పంజాబ్‌‌: రాహుల్‌‌ (నాటౌట్‌‌) 61, మయాంక్‌‌ (బి) చహల్‌‌ 45, గేల్‌‌ (రనౌట్‌‌) 53, పూరన్‌‌ (నాటౌట్‌‌) 6, ఎక్స్‌‌ట్రాలు: 12,

మొత్తం: 20 ఓవర్లలో 177/2.

వికెట్ల పతనం: 1–78, 2–171.

బౌలింగ్‌‌: మోరిస్‌‌ 4–0–22–0, సైనీ 4–0–21–0, చహల్‌‌ 2–0–28–1, ఉడాన 2–0–14–0, సిరాజ్‌‌ 3–0–44–0, సుందర్‌‌ 4–0–38–0.

కోహ్లీ @ 200

విరాట్‌ కోహ్లీ ఆర్‌ సీబీ తరఫున 200 మ్యాచ్‌ లు కంప్లీట్‌ చేసుకున్నాడు. ఐపీఎల్‌ లో ఆ జట్టు కు 185 మ్యాచ్‌ లు ఆడిన కోహ్లీ .. చాంపియన్స్‌ లీగ్‌ టీ20 టోర్నీలో 15 గేమ్స్‌ లో బరిలోకి దిగాడు. దాంతో, 200 మ్యాచ్‌ ల్లో ఒకే టీమ్‌‌కు ఆడిన ఫస్ట్‌‌ క్రికెటర్‌ గా నిలిచాడు.

స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ టీ20ల్లో 200 వికెట్ల క్లబ్‌ లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఇండియా ఐదో బౌలర్‌ గా నిలిచాడు.