తెలంగాణకు వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు  వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు...పలు జిల్లాలో వానలు పడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. జులై 09వ తేదీ ఆదివారం నుంచి జులై 13వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జులై 12, 13వ తేదీల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

జులై 09వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండనుండగా.. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చిరు జల్లులు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. జులై 08వ తేదీ శనివారం  జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ముత్తారంలో 63.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. పెద్దపల్లి పరిధిలోని శ్రీరాంపూర్‌లో 58.8 మి.మీ, ములుగు జిల్లా పరిధిలోని గోవిందరావుపేటలో 50 మి.మీ, కొమురం భీం పరిధిలోని సిర్పూర్‌లో 48 మి.మీ, పెద్దపల్లి జిల్లా పరిధిలోని మంథనిలో 45.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.