పోలీస్ ఉద్యోగాల ఏజ్ లిమిట్ పెంచాలె

పోలీస్ ఉద్యోగాల ఏజ్ లిమిట్ పెంచాలె

ఓయూ, వెలుగు : ఎస్సై, కానిస్టేబుల్, ఇతర యూనిఫాం ఉద్యోగాల వయోపరిమితిని మరో రెండేళ్ళు పొడిగించాలని డిమాండ్​ చేస్తూ నిరుద్యోగులు, స్టూడెంట్లు గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎన్ సీసీ గేట్ వరుకు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వయో పరిమితి పెంపు విషయంలో నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. వేరే  రాష్ట్రాల్లో  యూనిఫామ్​ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 30 నుంచి -32 ఏండ్లు ఉండగా, రాష్ట్రంలో పెంచితే వచ్చే నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. నోటిఫికేషన్లు వేయడంలో ప్రభుత్వం నాలుగేళ్ళ జాప్యం చేసినందువల్ల చాలా మంది పోలీసు​ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారని అన్నారు. సర్కారు చేసిన తప్పుకు నిరుద్యోగులు బలవుతున్నారని ఆయన చెప్పారు. గ్రూప్-1  పోస్టుల్లో డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ఎత్తును 165 సెంటీమీటర్లకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఎస్సీ మార్గదర్శకాలను అనుసరించి డీఎస్పీ పోస్టుల వయో పరిమితిని 32 ఏండ్లకు పెంచి.. దానిపై రాష్ట్ర సర్కార్ పెంచిన మూడేళ్ల పరిమితిని వర్తింపచేయాలని కోరారు.