ఇబ్బందులు పడుతున్న రాజీవ్​ స్వగృహ ఓనర్లు

ఇబ్బందులు పడుతున్న  రాజీవ్​ స్వగృహ ఓనర్లు
  • ఇబ్బందులు పడుతున్న ఓనర్లు
  • డబ్బులు తీసుకొని పార్కింగ్​కు స్థలం ఇవ్వని అధికారులు
  • అపార్ట్ మెంట్  సెల్లార్​లో నిలిచిపోతున్న డ్రైనేజీ
  • దోమలు, దుర్వాసన భరించలేకపోతున్నామని ఓనర్ల ఆవేదన

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ టవర్స్​లో నివాసం ఉంటున్న ఓనర్లు సమస్యలతో సతమతమవుతున్నారు. గత ఏడాది బండ్లగూడ రాజీవ్  స్వగృహ టవర్స్​లో ఆన్​లైన్ వేలంలో ఫ్లాట్లు కొనుగోలు చేసి అందులో వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే కనీస వసతులైన నీళ్లు, పార్కింగ్  వంటి సదుపాయాలు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా తమ గోడును అధికారుల దృష్టికి తీసుకెళ్తునా పట్టించుకోవటం లేదని ఓనర్లు వాపోతున్నారు. మార్కెట్  ధర కన్నా తక్కువగా, నాగోల్ మెట్రోకు దగ్గర ఉందని ఫ్లాట్లు కొంటే ఇన్ని సమస్యలా అని వాపోతున్నారు.

డ్రైనేజీ నీళ్లతో నిండిన పార్కింగ్

సెల్లార్​లో పార్కింగ్  ఏరియా అంతా నీళ్లతో నిండిపోయింది. ఫ్లాట్ల నుంచి నీళ్లు లీకవుతూ నిలిచిపోతున్నాయని, పాకర పట్టి దుర్వాసన వస్తోందని ఓనర్లు వాపోతున్నారు. దాంతోపాటు దోమల బెడద కూడా విపరీతంగా పెరిగిందని తెలిపారు. సమ్మర్​లోనే ఇలా ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 2018 నుంచి ఇతర టవర్లలో ఉంటున్న వారు నీటి బిల్లులు కట్టలేదు. వాటిని గత ఏడాది కొత్తగా వచ్చిన వారు కట్టాలని అధికారులు చెబుతున్నారు. తాము రాక ముందు ఉన్న నీటి బిల్లులును తాము ఎందుకు కట్టాలని కొత్తగా వచ్చిన వారు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు పట్టించుకోవట్లే 

గత ఏడాది రాజీవ్  స్వగృహ టవర్​లో వేలంలో ఫ్లాట్ వచ్చింది. ఏడాది కాలంగా నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నం. పార్కింగ్, సెల్లార్​లో నీళ్లు ఆగడం ఇలా ఎన్నో సమస్యలు ఉన్నయి. అధికారులకు చెబుతున్నా పట్టించుకుంటలేరు. సెల్లార్  అంతా దోమలతో నిండిపోయి దుర్వాసన కొడుతున్నది. పార్కింగ్​కు కట్టిన డబ్బులు రిటర్న్ ఇప్తామని అధికారులు అంటున్నారు. కానీ, గత ఏడాది నుంచి అడుగుతున్నా ఇవ్వడం లేదు. ఓపెన్ ప్లేస్​లో పార్కింగ్  ఇస్తే పాత ఓనర్లు లీగల్​గా వెళతామని హెచ్చరిస్తే అధికారులు వెనక్కి తగ్గారు. - జలీల్, ఫ్లాట్ ఓనర్, బండ్లగూడ

పెద్ద సమస్యగా పార్కింగ్

రాజీవ్ స్వగృహ టవర్లలో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ఫ్లాట్ల వేలంపాట సమయంలో సిల్ట్, ఓపెన్ పార్కింగ్​కు రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.1 లక్ష ఇలా ప్రత్యేకంగా వసూలు చేశారు. ఓపెన్ పార్కింగ్​కు డబ్బులు వసూలు చేసి, ఏడాది కాలంగా పార్కింగ్ ఫెసిలిటీ కల్పించడం లేదని ఓనర్లు చెబుతున్నారు. అలాగే ఓనర్లకు ఇవ్వాల్సిన పార్కింగ్ బకాయిలు రూ.75 లక్షలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.  2018 నుంచి మిగతా టవర్లలో ఉంటున్న ఓనర్లు అధికారుల నిర్ణయంపై మండిపడుతున్నారు. బండ్లగూడ సద్భావన  టౌన్​షిప్​లో  ఇప్పటికే ఉన్న ఫ్లాట్ల యజమానులు పూర్తి సౌకర్యాలు కల్పించాలని  ఎంతో కాలంగా కోరుతున్నారు. ‘‘బిల్డర్లకు ఫ్లాట్లను అమ్మకానికి పెట్టినప్పుడు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు సామాన్యులకు రోడ్డు సైడ్ పార్కింగ్ సదుపాయం ఇచ్చారు. ఓపెన్ ప్లేస్​ను పార్కింగ్​కు కేటాయిస్తే కోర్టుకు వెళతాం’’ అని ఓనర్లు హెచ్చరించారు.

దీంతో అధికారులు పార్కింగ్ డబ్బులు ఓనర్లకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తాము ఎంతో కాలంగా డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నా అధికారులు ఇవ్వడం లేదని ఓనర్లు చెబుతున్నారు. హౌసింగ్  అధికారులను ఈ విషయంపై సంప్రదించగా ఈ ఫైల్ హెచ్ఎండీఏ కమిషనర్ దగ్గర ఉందని, ఆయన ఆమోదిస్తే డబ్బులు తిరిగి ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 100 ఫ్లాట్లు ఉన్న ప్రతి అపార్టుమెంట్​కు కచ్చితంగా సినరేజ్ ట్రీట్ ప్లాంట్ ఉండాలి. ఇక్కడ 2,746 ఇళ్లు ఉన్నా దాని ఊసే లేదు. పూర్తి స్థాయి సదుపాయాలు లేకుండానే అధికారులు ఫ్లాట్లను పబ్లిక్​కు అమ్మారు. 2022 నుంచి వందల సంఖ్యలో కొత్త కుటుంబాలు వస్తుండడంతో సమస్యలు పెరుగుతున్నాయి.