వంట నూనెల రేట్లు దిగొస్తాయ్​!

వంట నూనెల రేట్లు దిగొస్తాయ్​!

న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల రేట్లు దిగి రానున్నాయి. పామాయిల్​పై ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గించడంతో దేశంలో వంట నూనెల రేట్లు కిందకి దిగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.నెల రోజుల డిస్కషన్స్​ తర్వాత క్రూడ్​ పామాయిల్​పై ఇంపోర్ట్ డ్యూటీని 30.25 శాతానికి తగ్గించారు. ఇందులో బేసిక్​ డ్యూటీ 10 శాతమైతే, 17.5 శాతం ఏఐడీసీ, 10 శాతం సర్​ఛార్జ్​. అంతకు ముందు ఈ ఇంపోర్ట్​ డ్యూటీ 35.75 శాతంగా ఉండేది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం జులై 1 నుంచి అమలులోకి వచ్చిందని, సెప్టెంబర్​ చివరి దాకా కొనసాగనుందని ప్రభుత్వం ప్రకటించింది.

రిఫైన్డ్​ పామాయిల్​పై ఇంపోర్ట్​ డ్యూటీని కూడా గతంలోని 49.5 శాతం నుంచి ఇప్పుడు 41.25 శాతానికి తగ్గించారు. సోయా ఆయిల్​పై డ్యూటీని మాత్రం మార్చలేదు. 38.50 శాతంగానే కొనసాగిస్తున్నారు. ఈ మేరకు సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ఇండైరెక్ట్​ టాక్సెస్​ అండ్​ కస్టమ్స్​ (సీబీఐసీ) నోటిఫికేషన్​ జారీ చేసింది. వంట నూనెల మంటతో సతమతమవుతున్న వినియోగదారులకు రిలీఫ్​ ఇవ్వడంతోపాటు, దేశంలోని రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గింపు నిర్ణయం సాయపడుతుంది. అక్టోబర్​ నెల నుంచి ఆయిల్​సీడ్స్​ సప్లయ్ మన దేశంలో​ భారీగా పెరుగుతుంది. దీంతో మన ఆయిల్​ సీడ్స్​  రైతులకు కొంత సపోర్ట్​ దొరుకుతుందనేది ప్రభుత్వ ఆలోచన.
కిందటేడాది నవంబర్​లో కూడా డ్యూటీ తగ్గింపు ద్వారా దేశంలో వంట నూనెల రేట్లు కిందకి తేవాలని ప్రభుత్వం ఒకసారి ప్రయత్నించింది. కాకపోతే, గ్లోబల్​గా ఆయిల్​ సీడ్స్​ కొరత ఉండటంతో అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. లా–నినాతోపాటు, కరోనా ఎఫెక్ట్​ వల్లా వంట నూనెల సప్లయ్​లో అడ్డంకులు ఏర్పడ్డాయి. వంట నూనెలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు అవసరానికి తగినంతగా సప్లయ్​ చేయలేకపోయాయి. మన దేశం ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గించిన తర్వాత కిందటేడాది నవంబర్​ నుంచీ మలేషియా, ఇండోనేషియా దేశాలు తమ దేశాలలో ఎక్స్​పోర్ట్​ డ్యూటీని పెంచేశాయి. ఈ సారి కూడా వచ్చే ఆగస్టు నుంచి ఎక్స్​పోర్ట్​ డ్యూటీని ఇప్పుడున్న 8 శాతం  నుంచి ఇంకా పెంచినా ఆశ్చర్యపోవక్కర్లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. అదే జరిగితే మన దేశంలోని వినియోగదారులకు మళ్లీ పామాయిల్​ అధిక రేట్ల బెడద తప్పకపోవచ్చని అంటున్నారు.

ఇంటర్నేషనల్​ మార్కెట్లో పరిస్థితులు ఇప్పుడు కొంత డిఫరెంట్​గా ఉన్నాయని, గత కొన్ని నెలలుగా మలేషియాలో పామాయిల్​ ప్రొడక్షన్​ బాగా పెరిగిందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇదే టైములో ఆ దేశం నుంచి ఎగుమతులు పెద్దగా పెరగలేదని చెబుతున్నారు. సోయాబీన్​ కొత్త పంట దిగుబడులు యూఎస్​, బ్రెజిల్​లలో భారీగా ఉంటాయనే అంచనాలతో గ్లోబల్​గా సోయా ఆయిల్​ రేట్లు కూడా ఇటీవలి కాలంలో బాగా పడిపోయాయి.  ఏదేమైనప్పటికీ, షార్ట్​ టర్మ్​లో మన దేశంలో పామాయిల్​ రేట్లు కొంత మేరకు తగ్గుతాయని, పండగ సీజన్​ నాటికి మళ్లీ పెరిగే సూచనలున్నాయని ఎక్స్​పర్టులు వెల్లడిస్తున్నారు.