ఉత్తర భారతంలో రావణుడి ఆలయం.. దసరా నాడు పూజలు

ఉత్తర భారతంలో రావణుడి ఆలయం.. దసరా నాడు పూజలు
  • దేశమంతా రాక్షసుడని దహనం చేసే రావణుడికి అక్కడ పూజలు
  • కొలిస్తే కోర్కెలు తీరుతాయని ఛత్రీ, ఠాకూర్ వర్గాల భావన

లక్నో: విజయ దశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. రాక్షస రాజు, లంకాధిపతి రావణుడిపై యుద్ధంలో శ్రీ రాముడి గెలుపుకు సంకేతం జరుపుకొనే సంబురం దసరా. ఆ లంకాధిపతి సంహారానికి గుర్తుగా దేశమంతా రావణ దహనాన్ని వేడుకలా చేస్తారు.

అక్కడ రావణుడికి పూజ

దసరా పండుగ సంబురాల్లో దేశమంతా రావణ దహనం చేస్తుంటే.. ఉత్తరాదిలోని ఓ ప్రాంతంలో కొంత మంది అదే రావణుడిని పూజిస్తున్నారు. ఆయన చల్లని కరుణ ఉంటే మంచి జరుగుతుందని భావిస్తారక్కడ. అది ఎక్కడో కాదు.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలోనే. 1890లో గురు ప్రసాద్ శుక్లా ఈ దశాననుడి మందిరాన్ని నిర్మించారు.

పూజ.. దహనం.. నివాళి

కేవలం ఏడాదికి ఒక్క రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. దసరా పండుగ నాడు మాత్రమే కొద్ది మంది స్థానికులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. ఛత్రీ, ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన వారు దశకంఠుడిని పూజిస్తారు. దీపాలు వెలిగించి, హారతి కూడా ఇస్తారు. మంత్రాలలో అర్చనలు చేస్తారు. రాత్రి వేళ వారూ రావణుడి బొమ్మను చేసి, దాన్ని దహనం చేస్తారు. అనంతరం ఆయనకు నివాళి అర్పిస్తారు. అంతే ఇక ఏడాదంతా మళ్లీ ఆలయం మూతేస్తారు. ఇలా చేస్తే తమ కోరికలు తీరుతాయని వారి నమ్మకం.