మోసాలను దాస్తున్న బ్యాంకులు

మోసాలను దాస్తున్న బ్యాంకులు
  • ఆర్బీఐ రిపోర్టు
  • జరిగిన మోసం గుర్తించడానికి చాలా టైం పడుతోంది
  • వెంటనే గుర్తిస్తే చర్యలు సాధ్యమవుతాయి

ముంబై: బ్యాంకులలో మోసాల సంఖ్య మనల్ని ఉలిక్కిపడేలా చేయకపోవచ్చు, కానీ, బ్యాంకులు మోసాలను తక్కువ చేసి చెబుతున్నాయనేది మనకు ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియాలోని బ్యాంకులు జరిగే మోసాలను బాగా తగ్గించి చెబుతున్నట్లు రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా నివేదిక వెల్లడించింది. 2018–19 లో బ్యాంకులు వెల్లడించిన మోసాలలో 90.6 శాతం, నిజానికి 2000 నుంచి 2018 సంవత్సరం మధ్యలో జరిగినవని తెలిపింది.

తక్కువగా చూపుతున్న మోసాలలో 40 శాతం మోసాలు 2013 నుంచి 2016  మధ్య కాలంలో జరిగినవని ఫైనాన్షియల్‌‌ స్టెబిలిటీ రిపోర్ట్‌‌ డేటా వెల్లడించింది. మోసం జరిగిన సమయానికి దానిని కనుగొనే సమయానికి చాలా వ్యవధి ఉంటోందని, ఇది చాలా కీలకమైనదని ఆర్‌‌బీఐ అభిప్రాయపడింది. ఇప్పుడు వెల్లడిస్తున్న మోసాలలో చాలా మోసాలు గత సంవత్సరాలలో జరిగినవే ఉంటున్నాయని పేర్కొంది. దీంతో మోసాలపై మార్గదర్శకాలను సమీక్షించాలని ఆర్‌‌బీఐ భావిస్తోంది. మోసాలు జరిగిన వెంటనే గుర్తించేలా అదనపు చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఏవైనా ఉల్లంఘనలుంటే వెంటనే చర్యలు తీసుకోవడం వీలవుతుందని అభిప్రాయపడుతోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు 2018–19లో  వెల్లడించిన మోసాలు చూస్తే, అప్పులలో వాటి వాటా కంటే మోసాలలో వాటి వాటా ఎక్కువగా ఉంటోందని ఆర్‌‌బీఐ డేటా చెబుతోంది. మార్చి 2019 చివరకి, మోసాలలో  బ్యాంకింగ్‌‌ ఇండస్ట్రీ సగటు 60.9 శాతమైతే, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా ఏకంగా 96 శాతంగా ఉంది. డిసెంబర్‌‌ 31 నాటికి  అప్పులు తీసుకున్న వాళ్లలో 204 మంది మోసగాళ్లని ఏదో ఒక బ్యాంకో లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులో వెల్లడించినప్పటికీ, మిగిలిన బ్యాంకులు దీనిని పట్టించుకోలేదని డేటాలో తేలింది.  ఆ బ్యాంకులు వారిని మోసగాళ్లుగా పరిగణించలేదని ఆర్‌‌బీఐ తేల్చింది.

ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో తీవ్ర జాప్యం కారణంగానే మోసాల గుర్తింపులో ఆలస్యం జరుగుతోందని, మరికొన్ని సార్లు ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో తేలిన విషయాలు అసంపూర్ణంగా ఉంటున్నాయని ఆర్‌‌బీఐ తన నివేదికలో వెల్లడించింది. 2018–19 కాలానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలోని నాన్‌‌ పెర్‌‌ఫార్మింగ్‌‌ ఎసెట్స్‌‌ (ఎన్‌‌పీఏ)ను అధ్యయనం చేస్తే ఈ ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయని, మోసాలు వెలుగులోకి వచ్చాయని, అందువల్లే ఇటీవలి సంవత్సరాలలో నమోదైన మోసాల సంఖ్య ఎక్కువైందని ఆర్‌‌బీఐ వివరించింది.