గోడౌన్​కు పంపిన వడ్లు 6 రోజులకు వాపస్​

గోడౌన్​కు పంపిన వడ్లు 6 రోజులకు వాపస్​

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు:   మెదక్​ జిల్లాలోని  మహమ్మద్​నగర్​  సొసైటీ కొనుగోలు కేంద్రం నుంచి  గోడౌన్​కు పంపిన వడ్లు 6 రోజులకు మళ్లీ  కేంద్రానికి వాపస్ వచ్చాయి.  ఆరు రోజుల కింద నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాసులు ఆదేశాలతో  సొసైటీకి లారీని పంపించారు.  కేంద్రంలో తూకం వేసిన  గ్రామానికి చెందిన బాలకృష్ణా గౌడ్, గాండ్ల నర్సింలు, లింగం అనే రైతులకు చెందిన 477 వడ్ల బస్తాలు  లారీలో  రెడ్డిపల్లి గోడౌన్​కు పంపించారు.

అయితే ఆ వడ్ల బస్తాలను అక్కడ దించుకోకుండా,  బ్రాహ్మణపల్లి గోడౌన్​కు తీసుకెళ్లాలని సూచించారు.  అక్కడ కూడా వడ్లను అన్ లోడ్ చేసుకోకపోవడంతో లారీ డ్రైవర్ విసుగు చెంది  శుక్రవారం రాత్రి లారీని తిరిగి మహమ్మద్​నగర్​ సొసైటీకి తీసుకొచ్చి ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసి  సదరు రైతులు శనివారం గ్రామంలో నిరసన తెలిపారు.  లారీలు రావడం లేదని రైతులు ధర్నాకు దిగుతామంటే రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో  వేస్తామని భయపెడ్తున్నారని  రైతులు ఆరోపించారు.  

తూకం వేసిన వడ్ల బస్తాలు ఎందుకు ఖాళీ చేయించడం లేదని ప్రశ్నిస్తున్నారు.   సర్పంచ్ దివ్య మహిపాల్ రెడ్డి, సొసైటీ  చైర్మన్ గోవర్ధన్ రెడ్డి,  స్థానిక ఎస్సై శివ ప్రసాద్ రెడ్డి  సొసైటీ వద్దకు వచ్చి  రైతులతో మాట్లాడి  లారీలను తెప్పించి వడ్లు తరలిస్తామని  హామీ ఇచ్చారు.