ఫ్రీ బస్ జర్నీపై మోదీ అక్కసు: మంత్రి పొన్నం

ఫ్రీ బస్ జర్నీపై మోదీ అక్కసు: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్​జర్నీ కల్పించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జీర్ణించుకోలేక పోతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టం వస్తున్నదని మాట్లాడడం ఆయన స్థాయికి తగదన్నారు. శనివారం మంత్రి పొన్నం మీడియాకు వీడియో రిలీజ్​ చేశారు. ‘‘ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఏదో నష్టం జరుగుతున్నట్లు మోదీ మాట్లాడడం సరికాదు. చిన్న, చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని తన స్థాయిని దిగజార్చుకోవద్దు.

కొన్ని రాష్ట్రాలు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ ప్రయాణానికి, మెట్రో ప్రయాణానికి ముడిపెట్టడం కరెక్టు కాదు’’ అని పొన్నం అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు మోదీ అంత అక్కసు వెళ్లగక్కడం ఎందుకని ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కామెంట్స్​ చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో ఇంకా కొన్ని రూట్లను పెంచి కొత్త బస్సులను నడుపుతామన్నారు. ఈ పథకాన్ని మరింత మంది ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.