సంక్షోభ బ్రిటన్​కు దిక్సూచి రిషి శునక్ : శ్యామ్ సుందర్ వరయోగి

సంక్షోభ బ్రిటన్​కు దిక్సూచి రిషి శునక్ : శ్యామ్ సుందర్ వరయోగి

రవి అస్తమించని సామ్రాజ్యంగా ఒక వెలుగు వెలిగిన బ్రిటన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన వేళ భారత సంతతికి చెందిన రిషి శునక్​ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో త్రుటిలో తప్పిపోయిన ప్రధాన మంత్రి పదవి తిరిగి ఆయన చేతికే వచ్చి చేరింది. అంటే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలడని టోరీ సభ్యులు భావించి మూకుమ్మడిగా 193 మంది ఎంపీలు మద్దతివ్వడం గమనార్హం. ప్రత్యర్థిగా పోటీ చేసిన పెన్నీ మోర్టాన్ కు కేవలం 27 మందే మద్దతివ్వడం, పోటీకి ముందే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వైదొలగడంతో శునక్​ విజయం సునాయాసమైంది. కన్సర్వేటివ్ పార్టీ డిప్యూటీ చీఫ్ క్రిస్ పించర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ aరాజీనామాతో ఏర్పడిన ప్రధానమంత్రి ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా చేరుకొని ఆగిపోయిన రిషి శునక్​ కేవలం 45 రోజుల వ్యవధిలోనే లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో మళ్లీ బ్రిటన్ కు దిక్సూచిగా నిలిచాడు.

ఆర్థిక సంక్షోభం

1980 మే 12న  సౌతాంప్టన్ లో జన్మించిన రిషి అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. అక్కడే భారతదేశానికి చెందిన ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తి పరిచయం కావడంతో ఆమెనే వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. దేశంలో స్థిరత్వం, ఐక్యతల సాధనే తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నట్లు ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన తొలి ప్రసంగంలో సునాక్ పేర్కొన్నారు. 2014 లో రాజకీయ ప్రవేశం చేసిన రిషి 2015లో రిచ్ మండ్ యార్క్ నుంచి ఎంపీగా తొలిసారి గెలుపొందగా తర్వాతి ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికయ్యారు. బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగిన సమయంలో శునక్​  ఆర్థిక మంత్రిగా పేరు గడించారు. కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ ప్రకటించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రపంచంలో అంటువ్యాధులు, యుద్ధాలు తదితర సంక్షోభ సమయాలు ఏర్పడినప్పుడు కూడా చెక్కు చెదరకుండా పటిష్టంగా కొనసాగిన ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ కు సొంతం. అందుకే ప్రపంచ ప్రఖ్యాత హెచ్ఎస్​ బీసీ, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ లాంటివి తమ ప్రధాన కార్యాలయాలను బ్రిటన్ లో నెలకొల్పాయి. కానీ ప్రస్తుతం బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. డబ్బులు లేక ప్రజలు పస్తులు ఉంటున్నారని విజ్ కన్స్యూమర్ అనే గ్రూప్ పేర్కొంది. ఏప్రిల్ లో ప్రభుత్వం ఇంధన మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించడంతో ప్రజలు ఇంధన పేదరికంలోకి నెట్టి వేయబడే పరిస్థితులున్నాయని విజ్ పాలసీ న్యాయాధిపతి రోసియో హెచ్చరించారు. రానున్న చలికాలంలో ప్రజలు చలి నుంచి ఎలా బయటపడతారోనని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని ఐఎంఎఫ్ కూడా హెచ్చరించడం గమనార్హం. 2023 నాటికి బ్రిటన్ వృద్ధి రేటు 5.3 శాతం కన్నా తక్కువకు పడిపోయే ప్రమాదముందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. 

చేతులెత్తేసిన లిజ్​​ ట్రస్​

ఈ పరిస్థితుల్లోనే 45 రోజుల క్రితం ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ చేపట్టిన చర్యలు మరింత సంక్షోభానికి దారితీశాయి. ఆమె అధికారంలోకి రాగానే 45 బిలియన్ పౌండ్ల పన్ను తగ్గింపుతో ఆమె ఆర్థిక మంత్రి క్వాసీ కార్టన్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ ప్రజల్లో కోపాన్ని మరింత పెంచింది. లిజ్ ట్రస్ ప్రభుత్వం పన్ను సంస్కరణల్లో భాగంగా అప్పటిదాకా ధనవంతులపై ఉన్న 45 శాతం పన్నును భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి కార్పొరేట్ పన్నును 25 నుంచి 19 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించడం కూడా ప్రజలతోపాటు కన్జర్వేటివ్ లో కూడా ఆగ్రహాన్ని కలిగించాయి. అయితే పన్నుల తగ్గింపుతో తగ్గిన లోటును ఎలా పూడుస్తారో లిజ్ ట్రస్ ఆర్థిక మంత్రి పేర్కొనలేదు. దీంతో ఆదాయం తగ్గి అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ అమాంతం పడిపోయింది. తాజా బడ్జెట్ లో విద్యుత్ చార్జీలను ఒక్కో మెగావాట్ కు 520  పౌండ్ల దాకా పెంచడం, పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే రేటు నిర్ణయించడంతో చివరికి సొంత పార్టీ నాయకులు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టయినా లిజ్ ట్రస్ ను తొలగించాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆమె స్వయంగా తన వైఫల్యాలను ఒప్పుకొని తాను బ్రిటన్ ను సంక్షోభం నుంచి గట్టెక్కించలేనని, తనను క్షమించాలని వేడుకుంటూ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందే ఆమె మంత్రివర్గంలోని  హోమ్ మంత్రి సౌల్లా బ్రవర్మన్ రాజీనామా చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా వామపక్ష భావజాలంతో స్థానిక హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా భారత్ – బ్రిటన్ ల మధ్య చేసుకోబోతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో కూడా భారత్ కు వ్యతిరేకంగా నోరుపారేసుకున్నారు. దీంతో భారత ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన రద్దు చేసుకున్నారు. బ్రిటన్ స్కాచ్ కు అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో వ్యాపారానికి భారీగా గండి పడి పన్నులు చెల్లించే పరిస్థితికి హోం మంత్రి కారకులయ్యారు. అసలే సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ కు ఈ ఒప్పందం జరిగితే ఎన్నో విధాలుగా లబ్ధి చేకూరేది. సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు రావడంతో ఆదిలోనే హంసపాదులాగా సౌల్లా బ్రవర్మన్ రాజీనామా చేయక తప్పలేదు. తర్వాతి పరిణామాలు లిజ్ ట్రస్ రాజీనామాకు కూడా దారితీశాయి. 

రిషిపైనే ఆశలు..

తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న రిషి శునక్​ బ్రిటన్ ను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని ప్రజానీకం కూడా విశ్వసిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన చేపట్టిన పలు రకాల చర్యలు వారి నమ్మకాన్ని వమ్ము చేయవనుకుంటున్నారు. భారత సంతతికి చెందిన రిషి శునక్​ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతుండటంతో భారత, బ్రిటన్ సంబంధాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం.

సంక్షోభానికి కారణాలు..

సంక్షోభ దుస్థితికి దారితీసిన పరిస్థితులను ఒకసారి గమనిస్తే, బోరిస్ జాన్సన్ పదవి నుంచి వైదొలగక ముందే బ్రిటన్ ఆర్థిక పరిస్థితి బాగలేదు. యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ నుంచి బ్రిటన్ వైదొలగడం కూడా ఒక రకంగా ఈ సంక్షోభానికి కారణంగా చెప్పవచ్చు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లో కొనసాగిన సమయంలో ఎంతో మంది నిపుణులు బ్రిటన్ కు వచ్చి తమ సేవలు అందించే వారు. బయటకు వచ్చిన తర్వాత అలాంటి వారి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కడ యూరోప్ దేశాల్లో తమ వ్యాపారాలు దెబ్బతింటాయోననే భయంతో పలు పరిశ్రమలు అక్కడి నుంచి తరలిపోయాయి. దీంతో వస్తు ఉత్పత్తి వ్యయం, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయి. ఆదాయం లేక ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత గడ్డు పరిస్థితుల నేపథ్యంలో గృహ రుణ రేట్లను 6.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించారు. చివరికి వడ్డీ రేట్లు1.25 శాతానికి పడిపోయాయి. దీంతో ద్రవ్య లభ్యత పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలని కరోనా తర్వాత మళ్లీ 14 ఏండ్ల గరిష్టానికి రుణరేట్లు పెంచేశారు.  దీంతో ప్రజల ఆదాయంలో అధిక భాగం రుణాలు తీర్చడానికే సరిపోయింది. ఐరోపా సమాఖ్యలో ఉన్నప్పుడు లభించిన రాయితీలు కూడా పోవడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్లు.. అప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ కు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తోడైంది.  రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడం, శీతాకాలం కావడంతో ఇంధన వినియోగం పెరిగి ధరలు విపరీతంగా పెరిగాయి. 

-శ్యామ్ సుందర్ వరయోగి, సీనియర్ జర్నలిస్టు