రోడ్లు రిపేర్లు చేయట్లే.. కొత్తవి వేయట్లే

రోడ్లు రిపేర్లు చేయట్లే.. కొత్తవి వేయట్లే
  • ఎన్​వోసీ తీస్కోకుండానే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు
  • గల్లీలతోపాటు మెయిన్ ​రోడ్లూ ఆగం
  • పనులయ్యాక తిరిగి రోడ్లు వేయడం లేదంటూ బల్దియాకు ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: వానలు గ్యాప్​ఇవ్వడంతో వాటర్​పైప్ లైన్లు, నాలాలు, కేబుల్స్ పనులంటూ సిటీలో మళ్లీ రోడ్ల తవ్వకాలు షురూ అయ్యాయి. పనులు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లు కొత్త రోడ్లు వెయ్యకపోగా కనీసం రిపేర్లు కూడా చేయడం లేదు. తవ్విపోసిన మట్టితో గుంతలు పూడ్చి వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల మిగిలిపోయిన మట్టిని రోడ్లపైనే వదిలేస్తున్నారు. వానలకు ముందు తవ్విన రోడ్లనే ఇంతవరకు బాగుచేయలేదు. ఎక్కడికక్కడ గుంతలు తేలి ప్రమాదకరంగా మారాయి. రోడ్లపై మట్టితో దుమ్మురేగుతోంది. వాహనదారులు గుంతలు, దుమ్ముతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల కనీసం నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ ​సమస్యలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి రోడ్లు తవ్వాలంటే ముందుగా జీహెచ్ఎంసీ అధికారుల నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు అవేమీ పట్టించుకోవడం లేదు. అధికారులు పర్మిషన్​ఇచ్చిన చోట కూడా తిరిగి రోడ్లు వేయించలేకపోతున్నారు. ఇలా గ్రేటర్​లోని మెయిన్, అంతర్గత రోడ్లు డ్యామేజ్ అయ్యాయి.

అంతర్గత రోడ్లు మరీ దారుణం
మెయిన్​రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో రోడ్లు తవ్వేసి నెల, రెండు నెలలు దాటినా రిపేర్లు చేయడం లేదు. గ్రేటర్​లో  9,013 కి.మీ మేర రోడ్లు విస్తరించి ఉండగా, ఇందులో 2,846 కి.మీ మేర బీటీ రోడ్లు, 6,167 కి.మీ మేర అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంతర్గత రోడ్లు దారుణంగా ఉన్నాయి. దాదాపు 2 వేల కి.మీ మేర డ్యామేజ్​అయి ఉన్నాయి. ఎవరికి కావాల్సిన విధంగా వాళ్లు తవ్వుకొంటూ పోతుంటే మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. స్థానిక రోడ్ల ఇబ్బందులపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. నాలాల పనుల కోసం జీడిమెట్లలోని మెయిన్​రోడ్లను తవ్వి వదిలేశారు. తిరిగి పూడ్చకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చందానగర్, ఉప్పల్, హఫీజ్​పేట, మల్కాజిగిరి, టోలిచౌకి, మెహిదీపట్నం, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

బిల్లులు ఆపే అధికారం ఉన్నా..
రోడ్లపై ఎలాంటి పనులు చేపట్టాలన్నా అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి ఎన్​వోసీలు తీసుకోవాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత తిరిగి రోడ్లు వేసే బాధ్యత సదరు కాంట్రాక్టర్ పైనే ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ రోడ్లు వేయకపోతే ఆ పనికి సంబంధించి బిల్లులు ఆపే అధికారం ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లకు ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అలుసుగా కాంట్రాక్టర్లు రోడ్లు బాగు చేయకుండానే చేతులు దులుపుకుంటున్నారు. అస్సలు చాలా పనులకు కాంట్రాక్టర్లు ఎన్​వోసీలు తీసుకోకుండా రాత్రికి రాత్రే పనులు పూర్తిచేసి వదిలేస్తున్నారు. పనుల విషయం జీహెచ్ఎంసీ ఏఈలకు కూడా తెలియడం లేదు. రోడ్లు దారుణంగా తయారయ్యాయని జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులకు ప్రస్తుతం ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.