సామాన్యుడికి షాక్: పండుగ వేళ ఆర్టీసీ సమ్మె

సామాన్యుడికి షాక్: పండుగ వేళ ఆర్టీసీ సమ్మె

దసరా, బతుకమ్మ పండుగ సంబురాల వేళ ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

ప్రజలూ కలిసి పోరాడాలి

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా 25 ఉమ్మడి డిమాండ్లతో అన్ని సంఘాలు కలిసి సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు అశ్వత్థామ రెడ్డి. దాదాపు నెల క్రితం నోటీసు ఇచ్చిన సమస్యలపై యాజమాన్యం స్పందించకపోవడంతో సమ్మె తప్పలేదన్నారు. కనీసం చర్చలకు పిలవలేదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రజలు కూడా తమతో కలిసి పోరాడాలని కోరారాయన. దసరా సందర్భంగా ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి చితుస్తున్నామని చెప్పారు. ప్రజలు, కార్మిక సంఘాలు, రాజకీయ నేతలు ఒత్తడి తెస్తే 5వ తేదీలోపే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ప్రజలపై పెను భారం

పండుగ సెలవుల్లో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇది పిడుగు లాంటి వార్త. గుర్తింపు సంఘంతో పాటు అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. అక్టోబర్ 5వ తేదీ ఉదయం నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితమవుతాయి. ఈ సమ్మె వల్ల సాధారణ ప్రయాణాలతో పాటు సండుగ సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లొచ్చే వాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఇప్పటికే పండుగ సమయంలో డిమాండ్ తో టికెట్ రేట్లను ప్రైవేటు ఆపరేటర్లు భారీగా పెంచేశారు. ఇక ఆర్టీసీ సమ్మెతో వారు ఇస్టానుసారం ధరలు పెట్టేసే అవకాశం లేకపోలేదు. ఇది సామాన్యుడిపై పెను భారం కానుంది. దీని వల్ల మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, నిరుపేద ప్రజలు ప్రయాణాలు మానుకున్నా ఆశ్చర్యం లేదు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవీ

  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
  • సిబ్బందిపై పని భారం తగ్గించాలి
  • అన్ని విభాగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
  • కొత్త బస్సుల కొనుగోలు
  • వేతన సవరణ చేయాలి
  • డీజిల్ ధరల పెరుగుదలతో పడిన భారాన్ని ప్రభుత్వం భరించాలి
  • ఎలక్ట్రికల్ బస్సుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించాలి
  • ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వాలి
  • రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా చేయాలి