శబరిమల దర్శనాలు.. వీరికే అనుమతి!

శబరిమల దర్శనాలు.. వీరికే అనుమతి!

బెంగళూరు: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల భక్తుల దర్శనార్థం తెరచుకోనుంది. మండలం-మకరవిలక్కు సీజన్ నేపథ్యంలో నవంబర్ 16న అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. అయితే దర్శనానికి అనుమతించాల్సిన భక్తులకు సంబంధించి డాక్టర్లు కొన్ని సూచనలు చేశారని సమాచారం. కేవలం కేరళ వాసులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని డాక్టర్లు సజెస్ట్ చేశారని తెలిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడకుండా ఉండేందుకే ఈ సూచనలు చేశారని తెలుస్తోంది. ప్రతి ఏడాది రెండు నెలలపాటు మండలం-మకరవిలక్కు సీజన్ సమయంలో ఆలయాన్ని తెరుస్తారు. ఈ సీజన్‌‌లో 30 లక్షల మంది భక్తులు శబరిమలలోని అయ్యప్పను దర్శనం చేసుకుంటారు.

‘కరోనా ప్రోటోకాల్స్ తప్పకుండా పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య విషయంలో పరిమితి విధిస్తాం. దర్శనానికి వచ్చే ముందు భక్తులు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి’ అని కేరళ దేవసోమ్ మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. ‘ఒకేసారి 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతించాలని సూచించాం. దర్శనానికి వచ్చే ముందు 14 రోజులు హోం ఐసోలేషన్‌‌లో ఉండాలి. దర్శనం తర్వాత 10 రోజులు క్వారంటైన్‌‌లో ఉండాలి’ అని డాక్టర్స్ ప్యానెల్ స్పష్టం చేసింది.