వైద్య రంగంలోని అన్ని సేవలు ఒకచోటే

వైద్య రంగంలోని అన్ని సేవలు ఒకచోటే

మార్కెట్లోకి హెల్త్‌‌కేర్‌‌ యాప్‌‌ ‘క్యూరాల్‌‌’

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ ప్రొవైడర్‌‌‌‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెయిన్స్‌‌‌‌ హెల్త్‌‌‌‌టెక్‌‌‌‌ శుక్రవారం తన మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ ‘క్యూరాల్‌‌‌‌’ను మార్కెట్లోకి తెచ్చింది. వైద్య రంగంలోని అన్ని సేవలనూ ఒకే చోట పొందేలా తీర్చిదిద్దడమే ఈ క్యూరాల్‌‌‌‌ ప్రత్యేకతగా ఫౌండర్, సీఈవో రఘు వీర్‌‌‌‌ వేదాంతం చెప్పారు. గత నెలరోజులుగా బేటా టెస్టింగ్‌‌‌‌ జరుగుతోందని, మౌఖిక ప్రచారం ద్వారా ఇప్పటికే 10 వేల మంది యూజర్లు యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకున్నారని తెలిపారు. పేషెంట్లు, డాక్టర్లు, మెడికల్‌‌‌‌ షాపులు, డయాగ్నస్టిక్‌‌‌‌ సెంటర్లు…అందరినీ ఒకే చోటికి చేరుస్తున్నామని చెప్పారు. యాప్‌‌‌‌ వినియోగానికి ఎలాంటి ఫీజూ చెల్లించక్కర్లేదని,  రాబోయే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా10 లక్షల మంది యూజర్లను సంపాదించాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నామని రఘు వీర్‌‌‌‌ వెల్లడించారు.

200 మంది డాక్టర్లు, కొన్ని ఫార్మసీలు ఇప్పటికే భాగస్వాములయ్యారని, జంట నగరాలలో దాదాపు 4,500 రిటైల్‌‌‌‌ ఫార్మసీలు ఉన్నాయని చెప్పారు. మూడు సంవత్సరాలు కష్టపడి సమగ్రమైన ఎలక్ట్రానిక్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ డేటాబేస్‌‌‌‌ను అభివృద్ధి చేశామని, దేశంలో ఇదే మొదటి ఎలక్ట్రానిక్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ డేటాబేస్‌‌‌‌ కావచ్చని అన్నారు. అమెరికాలోని హాస్పిటళ్లకు అవసరమైన బేకాఫీసు సర్వీసులను, సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను గత మూడేళ్లుగా అందిస్తున్నామని చెబుతూ, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి 250 మంది ఉద్యోగులున్నారని, ఇప్పటిదాకా రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టామని రఘు వీర్‌‌‌‌ వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌, విజయవాడ సిటీల్లో ఆఫీసులు నెలకొల్పినట్లు తెలిపారు. క్యూరాల్‌‌‌‌ యాప్‌‌‌‌ను ఉపయోగించడం చాలా సులభమని, అమెరికాలో అట్లాంటా కేంద్రంగా తమ మాతృ సంస్థ 18 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెప్పారు.